సంగారెడ్డి జిల్లాలో ఓ ఆవు కడుపు నుంచి 80కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను వైద్యులు తొలగించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లపై తిరుగుతున్న రెండు ఆవులను అధికారులు 20 రోజుల క్రితం అమీన్పూర్లోని గోశాలకు తరలించారు. అనారోగ్యంతో సరిగ్గా ఆహారం తీసుకోకపోవడంతో ఒక ఆవు మరణించింది.
విషయాన్ని గమనించిన గోశాల నిర్వాహకులు వైద్యులను పిలిచి రెండో ఆవుకు శస్త్రచికిత్స చేశారు. అమీన్పూర్ పశువైద్యాధికారి కృష్ణచైతన్య ఏడు గంటలపాటు శ్రమించి 80 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను బయటికి తీశారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మూగజీవుల ప్రాణాలకు ముప్పు కలిగించే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు కృష్ణ చైతన్య విజ్ఞప్తి చేశారు.