సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ ఈ నెల 9న హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో మృతి చెందింది. మృతదేహానికి కరోనా పరీక్ష చేశారు. అదే రోజు రాత్రి మహిళకు అంత్యక్రియలు నిర్వహించగా మరుసటి రోజు సాయంత్రానికి మృతురాలికి పాజిటివ్‌గా నిర్ధారణయింది. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ అధికారులు.. మృతురాలి అంత్యక్రియల్లో దగ్గరగా ఉన్న కుటుంబీకులు, బంధువులను గుర్తించి మీర్జాపూర్(బీ) ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. 25 మంది నమూనాలను పరీక్షలకు పంపగా శుక్రవారం రాత్రి 19 మందికి వైరస్ సోకినట్లు తేలింది.
అంత్యక్రియల్లో పాల్గొన్న నలభై, యాభై మంది
కరోనా సోకిన వారిలో చిన్నారులు, మహిళలు, పురుషులు ఉన్నారు. పాజిటివ్‌గా వచ్చిన వారిని సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళ అంత్యక్రియల్లో మరో నలభై, యాభై మంది పాల్గొని ఉంటారని.. వారందరినీ గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ అధికారులు చర్యలు ప్రారంభించారు.
జిల్లాలో 22కు చేరిన కేసుల సంఖ్య
శాంతినగర్‌లోని ప్రధాన రహదారులు, అంతర్గత దారుల్లో రాకపోకలపై పూర్తిగా నిషేధం విధిస్తూ రెడ్‌జోన్ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. పట్టణంలో ఇప్పటికే మూడు కరోనా పాజిటివ్ కేసులు ఉండగా 19 కొత్త కేసులు కలుపుకొని ఆ సంఖ్య 22కు చేరింది. ఒకేసారి కేసుల సంఖ్య 22కు చేరడం వల్ల స్థానికులు భయాందోళనలు నెలకొన్నాయి.
ఇదీ చదవండి: ఈనెల 17న జగన్, కేసీఆర్‌తో ప్రధాని భేటీ