MLA Jaggareddy Interesting Comments: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీకి సేవలందించేందుకు సిద్దంగా ఉన్న తన లాంటి వారిని ఎలా వాడుకోవాలో ఇప్పుడున్నఇంఛార్జిలు తెలుసుకోకపోవడం దురదృష్టకరమని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. 2017లో సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ నిర్వహించినప్పుడు ఆ సభ ఖర్చు అంత తానే భరించానన్న జగ్గారెడ్డి... ఆ గుర్తింపు ఇప్పుడు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.
రాహుల్‌గాంధీ నన్ను పిలిచి అభినందించారు: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటక నుంచి తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించిందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆ తరువాత అది సంగారెడ్డిలో కూడా 25కిలో మీటర్లు కొనసాగి మహారాష్ట్రకు వెళ్లిందని, అప్పుడు తాను సంగారెడ్డిలో ఉదయం 5 గంటలకే భారీ ఎత్తున రాహుల్ గాంధీకి స్వాగతం పలికానన్నారు. అప్పుడు పెట్టిన ఖర్చు కూడా తనదేనని ఆయన స్పష్టం చేశారు. అప్పట్లో స్వయంగా రాహుల్ గాంధీనే తనను పిలిచి చాలా బాగా చేశారని అభినందించినట్లు జగ్గారెడ్డి తెలిపారు.
ఆ పిచ్చితోనే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నాను: మనసులోని ఒక మాట పేరుతో బుధవారం కూడా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాహుల్ గాంధీ త్యాగాల కుటుంబమంటే తనకు చాలా ఇష్టమని, ఆ పిచ్చితోనే తాను కాంగ్రెస్‌లో కొనసాగుతున్నట్లు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. చాలా రోజులుగా తన మనసులో ఆవేదనలు మసులుతున్నాయని... వాటిలో ఒక మాటను తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు చెబుతున్నట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా బయటకు చెబితే ఏం అవుతుందో... చెప్పకపోతే ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఉన్నట్లు తెలిపారు.
గాంధీభవన్‌కి రాలేని పరిస్థితి ఏర్పడింది: తాను గాంధీభవన్‌లో కూర్చొని ఆనందించే పరిస్థితి లేకుండా పోయిందని... తప్పని పరిస్థితుల్లో మీడియా ద్వారా ఈ ఒక్క మాట కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు తెలియచేస్తున్నట్లు జగ్గారెడ్డి వివరించారు. గడిచిన ఐదు నెలలుగా తాను రాజకీయంగా గాంధీభవన్‌కి రాలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా బాధగా ఉందని అన్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లయితే... తాను గాంధీభవన్‌లో కూర్చొని తనకున్న సమస్యలను మర్చిపోయేవాడినని పేర్కొన్నారు. ఇవాళ ఆలాంటి పరిస్థితులు లేకుండా పోయినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: