CM KCR SANGAREDDY TOUR: సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ వెనకబడిన ప్రాంతాలు. ఈ నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో తాగు నీటికి కూడా కటకటే. కరవుతో అల్లాడే ఈ ప్రాంతాలకు గోదావరి నీళ్లు తీసుకు వచ్చి బంగారు పంటలు పండిచేలా... రెండు ఎత్తిపోతల పథకాలు... సంగమేశ్వర, బసవేశ్వర రూపొందించారు. వీటి ద్వారా నారాయణఖేడ్, జహీరాబాద్‌తో పాటు ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలు సైతం ప్రయోజనం పొందనున్నాయి. రూ.4,500 కోట్లతో నిర్మించే ఈ పథకాల ద్వారా 3 లక్షల 90వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
సంవత్సరం పొడవునా జలకళ..
సంగమేశ్వర, బసవేస్వర ఎత్తిపోతల పథకాలను సింగూర్ జలాశయం మీద నిర్మించనున్నారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు నీటిని అందించేందుకు కాళేశ్వరం నుంచి 20 టీఎంసీలు కేటాయించారు. ఇందుకోసం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో సింగూర్ జలాశయాన్ని అనుసంధానించనున్నారు. సింగూర్‌కు ఎగువ ప్రాంతం నుంచి నీటి ప్రవాహం లేకపోయినా.. కాళేశ్వరం నీటితో సంవత్సరం పొడవునా జలకళతో ఉండనుంది. సంగమేశ్వర ద్వారా 12 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. దీని ద్వారా సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాల పరిధిలోని 2 లక్షల 19వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. బసవేశ్వర ద్వారా 8 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల్లోని లక్షా 65 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నారు.
సీఎం ప్రసంగంపై ఆసక్తి..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత బహిరంగసభలో పాల్గొననున్నారు. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో సభా ఏర్పాట్లు చేశారు. నారాయణఖేడ్ పట్టణ శివారులోని అనురాధ కళాశాల మైదానంలో సభను నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తు కోసం 1,500 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. మహారాష్ట్ర పర్యటన తర్వాత నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో సీఎం ప్రసంగం, ప్రకటనపై ఆసక్తి నెలకొంది.
ఇదీ చూడండి: CM KCR Meet Sharad Pawar: దేశానికి కొత్త విజన్, సరైన అజెండా అవసరం: కేసీఆర్