Sangameshwara And Basaveshwara : సంగారెడ్డి జిల్లాలో బీడు భూములను సస్యశ్యామలం చేసేలా నారాయణ్‌ఖేడ్‌లో నిర్మిస్తున్న సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ వెనకబడిన ప్రాంతాలు. ఈ నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో తాగు నీటికి కూడా కటకటే. కరవుతో అల్లాడే ఈ ప్రాంతాలకు గోదావరి నీళ్లు తీసుకు వచ్చి బంగారు పంటలు పండిచేలా... రెండు ఎత్తిపోతల పథకాలు... సంగమేశ్వర, బసవేశ్వర రూపొందించారు. వీటి ద్వారా నారాయణఖేడ్, జహీరాబాద్‌తో పాటు ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలు సైతం ప్రయోజనం పొందనున్నాయి. రూ.4,500 కోట్లతో నిర్మించే ఈ పథకాల ద్వారా 3 లక్షల 90వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
సంవత్సరం పొడవునా జలకళ..
సంగమేశ్వర, బసవేస్వర ఎత్తిపోతల పథకాలను సింగూర్ జలాశయం మీద నిర్మించనున్నారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు నీటిని అందించేందుకు కాళేశ్వరం నుంచి 20 టీఎంసీలు కేటాయించారు. ఇందుకోసం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో సింగూర్ జలాశయాన్ని అనుసంధానించనున్నారు. సింగూర్‌కు ఎగువ ప్రాంతం నుంచి నీటి ప్రవాహం లేకపోయినా.. కాళేశ్వరం నీటితో సంవత్సరం పొడవునా జలకళతో ఉండనుంది. సంగమేశ్వర ద్వారా 12 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. దీని ద్వారా సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాల పరిధిలోని 2 లక్షల 19వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. బసవేశ్వర ద్వారా 8 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల్లోని లక్షా 65 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నారు. ఎత్తిపోతల పథకాల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : Harish Rao Narayankhed Tour : 'అక్కడ భూములు అమ్ముకోవద్దు.. భవిష్యత్తులో కోట్లు వస్తాయి'