High Court reacts to death of QadhirKhan: రాష్ట్రంలో సంచలనంగా మారిన మెదక్‌లోని ఖదీర్‌ఖాన్ మృతిపై సుమోటోగా హైకోర్టు స్పందించింది. పత్రికల్లో కథనాల ఆధారంగా సుమోటోగా హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఖదీర్‌ఖాన్ మృతిపై సిజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది. మెదక్ పోలీసుల దెబ్బలకు ఖదీర్‌ఖాన్ మృతి చెందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
పోలీసులు కొట్టడం వల్లే ఖదీర్ ఖాన్ మృతి చెందాడు..!: గత నెల 27న మెదక్‌లోని అరబ్ గల్లీలో గొలుసు దొంగతనం జరిగిందని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఖదీర్‌ఖాన్‌ను అదే నెల 29న అదుపులోకి తీసుకున్నారు. 2వ తేదీ వరకు పోలీస్ స్టేషన్లోనే ఉంచి, ఆ తర్వాత భార్యను పిలిపించి ఖదీర్‌ను ఆమెకు అప్పగించారు.
ఆ తర్వాత ఆయన అనారోగ్యానికి గురికావడంతో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి, ఆ తర్వాత కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి బంధువుల సహాయంతో తరలించారు. అక్కడ కూడా ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఖదీర్‌ఖాన్ చికిత్స పొందుతూ ఈనెల 16న రాత్రి మృతి చెందాడు. చనిపోయే ముందు పోలీసులు తనను కొట్టడం వల్లే తీవ్రంగా గాయపడ్డానని ఖదీర్ ఖాన్ మీడియాకు వివరించారు.
ఖదీర్ ఖాన్ మృతి విషయంపై బాధ్యులపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలంటూ ఈనెల 17న ఆయన భార్య పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. మజ్లిస్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ నేతృత్వంలోని బృందం మెదక్ జిల్లా కలెక్టర్, ఎస్పీను కలిశారు. స్పందించిన డీజీపీ ఇప్పటికే 3రోజుల క్రితమే కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా సీఐతో పాటు ఎస్సై రాజశేఖర్, కానిస్టేబుల్ ప్రశాంత్, పవన్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా హైకోర్టు స్పందనతో ఈ కేసు విచారణ ఉన్నత న్యాయస్థానంలోనే జరగనుంది.
ఇవీ చదవండి: