సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 5,110 ఉండగా ఆయా పరిశ్రమల్లో దాదాపు 1.50 లక్షల మంది పనిచేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక తోడ్పాటు పారిశ్రామిక ప్రగతికి ఊతమివ్వనుంది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న యాజమాన్యాలు ఉత్పత్తులను ప్రారంభించనున్నాయి. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల్లో నెలకొన్న అభద్రతాభావం దూరం కానుంది.
పెట్టుబడుల ఆధారంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలుగా గుర్తిస్తారు. సూక్ష్మ పరిశ్రమల పెట్టుబడి గతంలో రూ.25 లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.కోటికి, చిన్నపరిశ్రమల పెట్టుబడిని రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచారు. మధ్య తరహా పరిశ్రమల పెట్టుబడిని రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచడంతో ఆయా పరిశ్రమలకు రాయితీలు పెరగనున్నాయి.
ఈపీఎఫ్ జమతో ఇరువురికీ ఊరట...
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల్లో ఎక్కువ మందికి నెల వేతనాలు రూ.15 వేలలోపు ఉంటుంది. జిల్లాలో ఈ తరహా చిరు వేతనాలు అందుకునే కార్మికులు 80వేలకు పైగా ఉంటారు. కార్మికులు, యాజమాన్యం తరఫున చెల్లించాల్సిన 12 శాతం ఈపీఎఫ్ వాటాను కేంద్ర ప్రభుత్వమే జమచేస్తుంది. మార్చి, ఏప్రిల్, మే వరకు వర్తింపజేయగా తాజాగా జూన్, జులై, ఆగస్టు వరకు ప్రభుత్వమే చెల్లించనుండటం యాజమాన్యాలు, కార్మికుల ఊరటనిచ్చే అంశం. ఈ పరిణామం ద్వారా కనీసం రూ.20 కోట్ల వరకు లబ్ధి చేకూరుతుంది.
వడ్డీ మాఫీ లేకపోవడంపై...
రుణాలపై ఏడాది పాటు మారిటోరియం నిర్ణయాన్ని పారిశ్రామికవేత్తలు స్వాగతిస్తున్నారు. ఇది మంచిదే అయినా రుణాలపై వడ్డీ మాఫీ ప్రకటించకపోవడంపై అసంతృప్తి నెలకొంది. వడ్డీ మాఫీ చేయాలన్న తమ విజ్ఞప్తిని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.