హిందూ ధర్మ పరిరక్షణ, దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో మంత్రి పాల్గొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆలయాల నిధులను అప్పటి ప్రభుత్వాలు వాడుకునేవని ఆరోపించారు. కేసీఆర్ సర్కారు మాత్రం ఆలయాల అభివృద్ధి అత్యధిక నిధులు వెచ్చిస్తున్నట్లు గుర్తుచేశారు. యాదాద్రి, భద్రాద్రి ఆలయాల తరహాలో మండల, గ్రామాల్లోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
కాళేశ్వరం జలాలను సింగూరు నుంచి జహీరాబాద్ ప్రాంతానికి తీసుకువచ్చి ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర గుడిలో అభిషేకం చేస్తామన్నారు. త్వరలో జహీరాబాద్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కలిసి ముఖ్యమంత్రిని కలుస్తామని.. జహీరాబాద్ ఎత్తిపోతల పథకంపై చర్చిస్తామన్నారు.
హరీశ్ విరాళం..
కేతకి ఆలయంలో ఏర్పాటుచేసే గోశాలకు తన వేతనం నుంచి రూ.లక్ష 116 బహూకరిస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి ప్రకటనతో పలువురు దాతలు ముందుకు వచ్చారు. విరాళాలు అందించేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు.
ఆలయ కమిటీ పాలకవర్గానికి పూలమాలలు, శాలువలతో సత్కరించారు. అంతకుముందు ఝరాసంగంలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో.. కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు.
ఇవీచూడండి: రాష్ట్ర అధికారులకు పోలీస్ పతకాలను ప్రకటించిన కేంద్రం