రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్, రాయిపల్లి(డి) గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. గ్రామాల మీదుగా పారే నారింజ వాగు పొంగడం వల్ల 120 ఎకరాల్లో మినుము, సోయా, పత్తి, పెసర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నీట మునిగిన పంట పొలాలను వ్యవసాయ శాఖ డివిజన్ సహాయ సంచాలకులు బిక్షపతి, వ్యవసాయ విస్తీర్ణ అధికారి ప్రదీప్ పరిశీలించారు.
బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 68 మంది రైతులకు సంబంధించిన పంటలు నీట మునిగినట్లు అధికారులు గుర్తించారు. వాగు ఉప్పొంగడం వల్ల కోతకు వచ్చిన మినుము, సోయా పంటలు పూర్తిగా తడిసిపోవటం వల్ల అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపోయిన పంటల అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని అధికారులు రైతులకు భరోసా ఇచ్చారు.