సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో అమానవీయ(Inhumane) ఘటన చోటు చేసుకుంది. బస్టాప్ సమీపంలోని సులభ్ కాంప్లెక్స్‌లో ఆడపిల్లకు జన్మనిచ్చిన ఓ తల్లి(MOTHER).. పురిట్లోనే బిడ్డను వద్దనుకుంది. పొత్తిళ్లలో అదుముకోవాల్సిన ఆ తల్లి... ఆడశిశువు(BABY GIRL) కనుక తనకు వద్దని బయటకు పడేయబోయింది. ఈ ఘటనను స్థానికులు అడ్డుకోగా ఆ శిశువు ప్రాణాలతో బతికి బయటపడింది.
ఏం జరిగింది?
నారాయణఖేడ్ మండలం రాయలమడుగుకు చెందిన నాగేష్, మెగావత్‌బూలిలు రోజువారీ కూలీలుగా పనిచేస్తూ బతుకు బండి సాగించేవారు. పొట్టకూటి కోసం ఆ దంపతులు ఏడాది క్రితం అశోక్ నగర్‌కు వచ్చారు. తెల్లాపూర్ పరిధిలోని ఇందిరానగర్ వద్ద కొంతకాలం కూలి పని చేశారు. అంతా బాగానే ఉన్న సమయంలో రెండు నెలల క్రితం భర్త నాగేష్ స్వగ్రామానికి వెళ్లి... అక్కడే ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చేసేది లేక ఆమె ఓ మేస్త్రి వద్ద కూలీగా పని చేస్తున్నారు.
'పుట్టగానే వదిలించుకుందామని..'
గర్భిణీ అయిన మెగావత్‌బూలి నెలలు నిండడంతో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. శనివారం మధ్యాహ్నం సమయంలో లింగంపల్లి కూడలి జహీరాబాద్ బస్టాపులోని సులభ్ కాంప్లెక్స్‌లోకి వెళ్లారు. రెండు గంటలయినా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకుడు బలవంతంగా తలుపు తెరిచే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆమెకు కాన్పు జరగడంతో పుట్టిన పసిగుడ్డును కిటికీలోంచి బయటకు పడేసే ప్రయత్నం చేశారు.
'కన్నబిడ్డను ముట్టుకోనేలేదు'
ఇది గమనించిన స్థానికులు రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పసిబిడ్డను పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ తల్లి బూలి కన్నబిడ్డను దగ్గరకు తీసుకోవడానికీ ఇష్టపడలేదు. పోలీసులు సంగారెడ్డి ఐసీడీఎస్(ICDS) అధికారులకు తల్లిబిడ్డలను అప్పగించారు.
'ఆడపిల్ల వద్దు'
ఆ తల్లికి సీడీపీవో అధికారిణి చంద్రకళ కౌన్సిలింగ్ నిర్వహించారు. కాగా చిన్నారిని తీసుకోవడానికి ఆమె నిరాకరించారు. ఆడపిల్ల కాబట్టి తనకు వద్దు అని... భర్త లేని తాను స్వగ్రామానికి వెళ్లిపోతానని అధికారులతో బూలి చెప్పారు. అధికారులు ఆ తల్లి, శిశువులను సంగారెడ్డి పిల్లల సంరక్షణ కేంద్ర కార్యాలయానికి తరలించారు.
ఇదీ చదవండి: IIIT: రాష్ట్రంలో మరో ట్రిపుల్ఐటీ ప్రాంగణం.. కమిటీ సిఫారసు చేసిన ప్రాంతం ఎక్కడంటే!