Ramanuja Sahasrabdi Utsav: సమతకు చిహ్నమైన రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు పదో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, సందర్శకులు తరలిరావడంతో శ్రీరామ నగరం జనసంద్రంగా మారింది. సమతామూర్తి కేంద్రాన్ని బాబా రాందేవ్ సందర్శించారు. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, ట్రాన్స్‌కో ఎండీ ప్రభాకర్‌రావు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, నటుడు అల్లు అర్జున్ సైతం సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు.
ఈరోజు కార్యక్రమాలు
ఉత్సవాల్లో భాగంగా నేడు సమతామూర్తి సన్నిధిలో ఉన్న 108 దివ్యదేశాల్లో 36 ఆలయాల్లోని దేవతామూర్తులకు ప్రాణ ప్రతిష్ఠాపన చేశారు. యాగశాలలోని పుష్ప మండపంలో వైదిక సంస్కారాలు పూర్తి చేసిన అనంతరం దేవతామూర్తులను దివ్యదేశాలకు తీసుకొచ్చారు. చినజీయర్ స్వామి స్వయంగా దివ్యదేశాల్లో పూజలు నిర్వహించి దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. మరో 21 దేవాలయాల్లో దేవతామూర్తుల ప్రతిష్ఠాపనతో మొత్తం 108 దివ్యదేశాల దర్శనానికి అనుమతించనున్నారు. ఈ నెల 13న ఆ 21 దేవాలయాల్లోనూ ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో సామూహిక ఉపనయనాలు, విద్యాప్రాప్తికై హయగ్రీవ ఇష్టి నిర్వహించారు. ప్రవచన మండపంలో శ్రీ లక్ష్మీనారాయణ పూజ, కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
సందడిగా సమతామూర్తి కేంద్రం
మరోవైపు రామానుజాచార్యుల విగ్రహ సందర్శన కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అతిథుల రాకతోనూ సమతామూర్తి కేంద్రం మరింత సందడిగా మారింది. అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి.. సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రం విశేషాలను చినజీయర్ స్వామి.. ఆయనకు వివరించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. కుటుంబసభ్యులతో కలిసి సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు.
జయజయ ధ్వానాలతో
యతి రామానుజాచార్యుల జయజయ ధ్వానాలతో ముచ్చింతల్ మార్మోగుతోంది. వేద పారాయణం.. అష్టాక్షరీ మహా మంత్ర జపం.. విష్ణు సహస్ర నామ పారాయణల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని భగవన్నామస్మరణలో మునిగిపోతున్నారు. శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహంలో నగరం నుంచి పెద్దఎత్తున భక్తులు విచ్చేసి సమతామూర్తిని దర్శించుకుంటున్నారు. ప్రధాన యాగశాలలో పెరుమాళ్ స్వామికి పెద్దఎత్తున పూజలు చేస్తున్నారు. ఈ నెల 13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. 120 కిలోల స్వర్ణమూర్తిని ఆవిష్కరించి లోకార్పణం చేయనున్నారు. 14న విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది.
ఇదీ చూడండి: CM KCR Jangaon Tour: వారికి ప్రత్యేక అలవెన్సులు ఇచ్చేందుకు సిద్ధం: కేసీఆర్