ఎవరూ లేరని ఇంట్లోకి చొరబడ్డ ముగ్గురు దొంగల తాట తీసింది ఓ మహిళ. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామంలోని సిరిమల్లెకాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్న అర్థరాత్రి సైదా సుల్తానా అనే ఒంటరి మహిళ ఇంట్లోకి ముగ్గురు దొంగలు చోరబడ్డారు. చోరికి ప్రయత్నిస్తుండగా.. అప్రమత్తమైన సైదా తిరగబడింది. ఇంట్లోని వస్తువులు, నగదు దొంగలు ఎత్తుకెళ్లకుండా అడ్డుకుంది. కొద్దిసేపు ఆ ముగ్గురు దొంగలతో తలపడింది. దొంగలు కూడా ఆ మహిళను తీవ్రంగా కొట్టారు. ఓ దొంగ కుర్చితో కొట్టడం వల్ల సైదా సుల్తానా స్పృహ తప్పి పడిపోయింది. చుట్టుపక్కల వారు వస్తున్నారని గమనించిన దొంగలు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సైదా సుల్తానా సాహసాన్ని అభినందించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డితోపాటు ఎస్వోటీ పోలీసులు... సైదా నివాసంలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దొంగలదాడిలో సైదా సుల్తానా తలకు, మోచేతికి గాయాలయ్యాయి.
ఇవీ చూడండి: "ఈఎస్ఐ" కుమ్మక్కయ్యారు... కోట్లు మింగారు..!