ఏపీలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో రోజుకు లక్ష నుంచి రెండు లక్షల మంది వస్తారు. అలాంటిది 10వేల మందే రండి.. అని చెబితే.. ఆగిపోతారా అనేది ప్రస్తుతం అందరిలోనూ నెలకొన్న సందేహం. ఉచిత దర్శనానికి సైతం టిక్కెట్లను ముందస్తుగా ఇస్తామని, అవి ఉన్న వాళ్లనే అనుమతిస్తామనే విషయం ఎంతగా ప్రచారం చేసినా.. సామాన్య భక్తులందరికీ చేరడం అసాధ్యం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎక్కడెక్కడి నుంచో వచ్చి దుర్గమ్మను ఏటా దర్శించుకుంటూ ఉంటారు. ఈసారి కొంతమందినే అనుమతిస్తాం, ఎక్కువ మంది రావొద్దని అంటే.. ఎంతమంది ఆగిపోతారనేది సమాధానం దొరకని ప్రశ్న.
ఆచరణలో సాధ్యమైనా..!
తిరుపతిలో ఈ నెల 19 నుంచి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా ఆలయం లోపలే నిర్వహించాలని నిర్ణయించారు. భక్తులకు అనుమతి, ఊరేగింపు ఏమీ లేకుండా ఏకాంత బ్రహ్మోత్సవాలుగా నిర్వహించనున్నారు. అలాంటిది.. దసరా ఉత్సవాలను దుర్గగుడిలో ఏటా మాదిరిగానే నిర్వహించి, భక్తులను మాత్రం తక్కువగా అనుమతిస్తామంటూ.. అధికారులు పెద్ద సాహసమే చేస్తున్నారు. ఎంతగా రావొద్దని ప్రచారం చేసినా క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులను అనుమతిస్తున్నారనే విషయం తెలిస్తే.. ఎక్కువ మంది రాకుండా ఉండరు. ఎలాగైనా అమ్మవారిని దర్శించుకుని వెళ్లిపోవాలనే తలంపుతో విజయవాడకు చేరుకుంటారు. వారు ఇక్కడికి వచ్చాక.. కనీసం అన్నదానం, క్లాక్‌రూంలు, చెప్పుల స్టాండ్లు, మంచినీరు అందించే ఏర్పాట్లు కూడా లేవని తెలిశాక.. వెనక్కి తిరిగి వెళ్లిపోతారా? ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శించుకునే వెళతామంటూ కొండకు చేరుకుంటారు. రోజుకు పది వేల మందికే అనుమతి ఉందని చెప్పినా వినే పరిస్థితి ఉండదు. ఎక్కడెక్కడ నుంచో వచ్చామంటూ.. ఇంద్రకీలాద్రి చుట్టుపక్కలే ఉంటారు. అమ్మవారిని దర్శించుకున్నాకే.. తిరుగు ప్రయాణం అవుతారు. కృష్ణా నదిలో స్నానాలు చేయకుండా ఆపుతామని, కేశఖండనశాల సైతం ఈసారి ఉండదని అధికారులు చెబుతున్నారు. కానీ.. మొక్కులు తీర్చుకునేందుకు ఎక్కువ మంది వస్తారు. దుర్గగుడి ఆధ్వర్యంలో అధికారికంగా కేశఖండనశాల ఏర్పాటు చేయకపోతే, వన్‌టౌన్ సహా చుట్టుపక్కల నుంచి ప్రైవేటుగా చాలా మంది పుట్టుకొస్తారు. తలనీలాలు తాము తీస్తామంటూ.. భక్తుల నుంచి వసూళ్లు చేయడం ఆరంభిస్తారు. ఆ తర్వాత కృష్ణా నదిలో ఎక్కడో ఒక దగ్గర భక్తులు స్నానాలకు దిగుతారు. అధికారులు కేవలం పది వేల మందే రావాలంటూ ప్రకటనలు ఇచ్చి ఊరుకోవడంతోనే సరిపెడితే.. ఇలాంటి అనేక సమస్యలు ఎదురుకాక తప్పదు.
కొత్త సమస్యలు వచ్చే అవకాశం..
దుర్గగుడికి ఏటా దసరా ఉత్సవాల్లో పది రోజుల్లో కనీసం 12-15లక్షల మంది వరకు భక్తులు వస్తుంటారు. అలాంటిది.. కేవలం లక్ష మందితోనే ఈసారి సరిపెడతామంటూ చెప్పడం.. ఆచరణలో అసలు సాధ్యం కాదు. ఎందుకంటే.. ఇంద్రకీలాద్రికి చుట్టుపక్కల ఉండే వన్‌టౌన్ ప్రాంతం నుంచే ఆ లక్ష మంది కంటే ఎక్కువగా వచ్చి దర్శనం చేసుకుని వెళతారు. అలాంటిది.. ఎవరిని.. ఎంతమందిని ఆపగలరనేది అధికారులు మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఆలోచించే తిరుపతిలో ఈ ఏడాది ఏకాంత బ్రహ్మోత్సవాలుగా ప్రకటించారు. దసరా ఉత్సవాలు ఏ ఇబ్బందీ లేకుండా సాగాలంటే.. పూర్తిగా భక్తులకు అనుమతి లేదని చెప్పడం, లేదంటే.. తిరుపతిలో మాదిరిగా నిర్వహించడం ఒక్కటే మార్గం. లేదంటే.. వచ్చే భక్తులకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకపోతే అదనంగా మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. వీటన్నింటిని అధికారులు మరింత లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇదీ చదవండి: మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్