రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన జూకంటి జంగయ్య పేరిట 7.30 ఎకరాల భూమి ఉంది. ఆయన మరణించడంతో పెద్ద కుమారుడైన గోపయ్య పేరిట పట్టా అయ్యింది. ఆ భూమిని ఆయన తన తమ్ముళ్లు అయిన రామయ్య, బుచ్చయ్యకు పార్టిషన్ చేయకుండా... 5 ఎకరాలను ఇతరులకు విక్రయించారు. దీంతో భూమిని పట్టా చేయవద్దంటూ బుచ్చయ్య కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం గత నవంబర్‌లో ఇన్‌జక్షన్ ఆర్డర్ ఇచ్చింది. బాధితుడు వాటిని చేవెళ్ల తహసీల్దార్ షర్మిలకు ఇచ్చినప్పటికీ... పట్టించుకోకుండా మార్చి 23న వేరే వ్యక్తి పేరిట పట్టా చేశారని ఆరోపించారు.
ఆర్డీవోకు ఫిర్యాదు...
కోర్టులో కేసు, ఇన్‌జక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ భూమిని తహసీల్దార్ ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయడంతో బాధితులు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ భూమిని పట్టా చేయడం ఎంత వరకు న్యాయమని బాధితులు అన్నారు. తప్పనిసరిగా హైకోర్టులో... కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామని తెలిపారు.
కోర్టులో కేసు నడుస్తున్న భూములను రిజిస్ట్రేషన్ చేయవద్దు. ఘటనపై మా పరిధిలో విచారణ చేస్తాం. బాధితులు కలెక్టర్ కు ఫిర్యాదు చేసుకోవచ్చు... లేదా న్యాయస్థానం ద్వారా కూడా వెళ్లవచ్చు. కోర్టు కేసులు ఉండి, ఆర్డర్స్ ఉంటే ధరణిలో కోర్టు కేసులు, సమాచారం కాలంలో లాగిన్ అయి వివరాలను నమోదు చేసుకోవాలి. ---- ఆర్డీవో వేణు గోపాల్ |
ఇదీ చదవండి: కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్న గవర్నర్ తమిళిసై