టీఎస్ యుటీఎఫ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కెజీబీవీ, యూఆర్ఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగులు.. తమ డిమాండ్‌లను నెరవేర్చాలంటూ కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలను పెంచాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని అన్నారు.
కేజీబీవీ, యుఆర్‌ఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని యూటీఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాములయ్య ఆరోపించారు. పెరుగుతున్న ధరల అనుగుణంగా పీఆర్సీ ప్రకటించకుండా ఉద్యోగులపై కక్ష ఎందుకని మండిపడ్డారు. 45శాతం పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2014లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న వారందరినీ క్రమబద్దీకరించాలని కోరారు.
కేజీబీవీ, యుఆర్‌ఎస్ మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అందించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య కార్డులు జారీ చేసి నగదు రహీత వైద్యం అందించాలని కోరారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు.
రాష్ట్రంలోని 475 కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలు, 29 అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు సమగ్ర శిక్షా పథకంలో భాగంగా... విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉన్నాయని తెలిపారు. వీటిలో పని చేస్తున్న ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలన డిమాండ్ చేశారు. తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఫిబ్రవరి 12న సచివాలయం ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'రైతులకు ఒక్క ఫోన్‌కాల్ దూరంలో ప్రభుత్వం'