రెండో దశలో కుటుంబాలకు కుటుంబాలే వైరస్ బారిన పడుతున్నాయి. కొవిడ్ సోకినవారంతా హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బయటకు వెళ్లలేకపోతున్నారు. ఫలితంగా ఇంట్లో వంట చేసుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. అలాంటివారికి హైదరాబాద్ వనస్థలిపురంలోని యువజన సంఘం అండగా నిలుస్తోంది. సాహెబ్‌నగర్‌లోని త్రినేత్ర యువజన సంఘానికి చెందిన యువకులు... సేవాభావంతో ముందుకువచ్చారు. కరోనా బారిన పడిన వారి ఇళ్లకు వెళ్లి భోజనం అందజేస్తున్నారు.
యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతి రోజు 250 మందికి భోజనం పంపిణీ చేస్తన్నారు. కాలనీలోని కమ్యూనిటీ హాల్‌లో ఉదయమే ప్రత్యేకంగా వంటలు చేసి ప్యాకెట్లలో నింపుతున్నారు. మధ్యాహ్నమే కాకుండా రాత్రి కూడా కొవిడ్ సోకినవారి ఇంటికి వెళ్లి భోజనం అందిస్తున్నారు. భోజనంలో చపాతీతోపాటు కోడిగుడ్డు, ఎండుఫలాలు ఉండేలా చూస్తున్నారు. కరోనా బారిన పడిన వారికి పోషకాహారం అవసరం కనుక... పోషకాలు ఉండేలా శ్రద్ధపెడుతున్నారు. భోజనం అవసరమైనవారు 9393333111 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించాలని కోరారు.
ఇదీ చదవండి: ఆంక్షలను కఠినంగా అమలు చేయాలి: సీఎం కేసీఆర్