Revanth reddy padayatra: తెలంగాణను అభివృద్ధి చేసే ఆలోచన సీఎం కేసీఆర్‌కు లేదని.. రాష్ట్రాన్ని ఎలా కొల్లగొట్టాలనేదే ఆయన నిరంతర ఆలోచన అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రజల ఓట్లతో గెలిచిన తెరాస.. ఇప్పుడు రైతుల వడ్లు కొనడం లేదని విమర్శించారు. రైతుల వడ్లు కొనే వరకు కాంగ్రెస్ పోరాటం కొనగుతుందని స్పష్టం చేశారు. చమురు, నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ.. రంగారెడ్డి జిల్లా ముడిమ్యాల నుంచి చేవెళ్ల వరకు రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. అనంతరం చేవెళ్లలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రేవంత్‌తో పాటు.. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్ పాదయాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని రేవంత్ కోరారు.
అన్నీ మాయమాటలే
'కాంగ్రెస్ హయాంలో 50 రూపాయలు ఉన్న పెట్రోల్.. ఇప్పుడు 110కి చేరింది. గతంలో రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర.. ప్రస్తుతం వెయ్యికి చేరింది. కేంద్రంలో భాజపాను గెలిపిస్తే నల్లధనాన్ని తీసుకువచ్చి.. ప్రజల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15 లక్షలు వేస్తానన్న ప్రధాని మోదీ.. ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా చూపించలేదు. కేంద్రంలో ఏడాదికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానని నిరుద్యోగులకు మాయమాటలు చెప్పారు. ప్రజల మీద భారం మోపి ఈ ఎనిమిదేళ్లలో కేంద్రం ఇప్పటి వరకూ దాదాపు రూ.32 లక్షల కోట్లు కొల్లగొట్టింది.' - రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
నడ్డి విరుస్తున్నారు
Revanth reddy speech in chevella: ధాన్యం కొనుగోళ్ల అంశంపై అగ్గి పుట్టిస్తానని దిల్లీకి వెళ్లిన కేసీఆర్.. ఏం చేశారని రేవంత్ ప్రశ్నించారు. భాజపా పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసరాలు, చమురు ధరలు తగ్గించడంతో పాటు రైతుల ధాన్యం కొనుగోళ్లు చేపట్టేవరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ప్రాణాలు పోతున్నా
'ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లను చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం.. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రభుత్వ వైఖరికి కొందరు రైతులు ధాన్యం కుప్పలపైనే ప్రాణాలు కోల్పోయారు. ధాన్యం కొనుగోళ్లపై దిల్లీలో తేల్చుకుంటానన్న కేసీఆర్.. తిరిగి వచ్చి సమాధానం చెప్పలేదు. చేవెళ్ల ఓటర్ల ఓట్లతో గెలిచిన తెరాస ఎంపీ రంజిత్ రెడ్డి.. పార్లమెంటు సమావేశాల్లో ఏం సాధించారు.?. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి.' - రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇదీ చదవండి: CM KCR meeting: యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు: సీఎం కేసీఆర్