ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల పునఃప్రారంభంతో.. ఇంతకాలంగా షెడ్డుకే పరిమితమైన బస్సులు రోడ్లపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బస్సుల ఫిట్నెస్పై రవాణా శాఖ దృష్టి సారించింది. విద్యాసంస్థలకు సంబంధించిన బస్సులను ప్రతి ఏడాది తప్పనిసరిగా ఫిట్నెస్ చేయించుకోవాలి రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఫిట్నెస్ లేనివే ఎక్కువ
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సుమారు 10వేలు, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20వేల పైచిలుకు విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. కొవిడ్ కారణంగా బడి బస్సులు ఏడాదిగా ఫిట్నెస్కు నోచుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 85శాతం బస్సులు ఫిట్నెస్కు దూరంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఒక్క హైదరాబాద్లోనే 1549 ఈ తరహా బస్సులు ఉంటే.. అందులో కేవలం 57 వాహనాలకే ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఇక్కడా 85శాతం బస్సులు ఫిట్ నెస్కు దూరంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ బడి బస్సులకు సంబంధించి ఇదే పరిస్థితి నెలకొన్నట్లు రవాణాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
అలా అయితేనే ధ్రువీకరణ పత్రం
బడి బస్సులకు సామర్థ్యం ఉంటేనే అందులో ప్రయాణించే విద్యార్థులు సురక్షితంగా ఉంటారని అధికారులు స్పష్టం చేశారు. స్కూల్ బస్సుల్లో రవాణాశాఖ జారీచేసిన విద్యాసంస్థ పర్మిట్ కచ్చితంగా ఉంచుకోవాలని.. దానిపై బస్సు జీవితకాలం తేదీ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. డ్రైవర్ ఆరోగ్యంగా ఉండాలని.. ప్రతి మూడు నెలలకు ఒకసారి కంటి పరీక్షలు, ఇతర పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఎలాంటి మత్తు పదార్థాలు, చెడు అలవాట్లు లేనివారిని డ్రైవర్లు, క్లీనర్లుగా నియమించాలని పేర్కొన్నారు. ఫిట్నెస్ పరిశీలన సందర్భంగా ఆర్టీఏ సిబ్బంది స్వయంగా బస్సును నడిపి సామర్థ్యాన్ని పరిశీలించడంతో పాటు.. అన్ని రకాల పత్రాలు పరిశీలిస్తారు. అధికారులు సంతృప్తి చెందాకే ఫిట్నెస్ ధ్రువీకరణ జారీ చేస్తారు. ఆర్టీఏ అధికారులు ఇచ్చిన ఫిట్నెస్ సర్టిఫికెట్ ఏడాదిపాటు పనిచేస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 21,096 విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. జిల్లాల వారీగా చూసుకుంటే
ఆదిలాబాద్ -146, కుమురం భీం -80, నిర్మల్ -216, మంచిర్యాల -353, కరీంనగర్ -784, జగిత్యాల -411, పెద్దపల్లి -258, రాజన్న సిరిసిల్ల -132, వరంగల్ రూరల్ -305, వరంగల్ అర్బన్ -710, జనగాం -160, జయశంకర్ -168, మహబూబాబాద్ -172, ఖమ్మం -732, భద్రాద్రి -277, నల్గొండ -581, సూర్యాపేట -409, యాదాద్రి -309, మహబూబ్ నగర్ -424, నాగర్ కర్నూల్ -186, వనపర్తి -182, జోగులాంబ -185, రంగారెడ్డి -5,088, వికారాబాద్ -201, మేడ్చల్ మల్కాజిగిరి -4,754, హైదరాబాద్ -1549, సంగారెడ్డి -855, సిద్దిపేట -288, మెదక్ -257, నిజామాబాద్ -694, కామారెడ్డి -230 బస్సులు ఉన్నాయి.
ఆర్టీఏ కార్యాలయం | ఫిట్నెస్ ధ్రువీకరణ ఉన్నవి | ధ్రువీకరణ లేనివి | మొత్తం |
ఖైరతాబాద్ | 24 | 587 | 611 |
సికింద్రాబాద్ | 17 | 199 | 216 |
మలక్ పేట్ | 03 | 188 | 191 |
బండ్లగూడ | 05 | 391 | 396 |
మెహదీపట్నం | 08 | 127 | 135 |
మొత్తం | 57 | 1492 | 1549 |
ఫిట్నెస్ లేని బస్సులు సీజ్
ఏడాదిన్నర కాలంగా బస్సులు నడపకపోవడంతో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని డ్రైవర్లు పేర్కొంటున్నారు. ప్రధానంగా బ్యాటరీలు డిశ్చార్జ్ కావడం లేదని చెప్పారు. అందుకే వాటిని తిరిగి ఛార్జ్ చేసుకోవాల్సివస్తుందని. కొన్నిసార్లు కొత్త బ్యాటరీ మార్చుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఆయిల్ ఛేంజ్, బ్రేకులు వంటి వాటికి మరమ్మతులు చేసుకోవాలని మెకానిక్లు సూచిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో రవాణాశాఖ అధికారులు పాఠశాలల బస్సులను తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులను సీజ్ చేశారు. నేటి నుంచి స్కూల్ బస్సుల ఫిట్నెస్పై వరుసగా తనిఖీలు చేస్తామని అధికారులు తెలిపారు. పాఠశాలల యజమానులు తప్పనిసరిగా బస్సులను ఫిట్నెస్ చేయించుకోవాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Sabitha Indra Reddy: 'తల్లిదండ్రుల నమ్మకం, విశ్వాసాన్ని నిలబెట్టాలి'