ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మీ ఓటు మాకే వేయాలంటూ పార్టీల నేతలు పట్టభద్రుల చెంతకు వెళుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెరాస... రెండు స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహాలు పన్నుతోంది. రాష్ట్ర ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల కంటే ఒకటి రెండు శాతం పీఆర్సీ అధికంగా వస్తుందని... పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు. వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలో పలు ఉద్యోగుల సంఘాల నాయకులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతిపక్ష పార్టీల అసత్య ప్రచారాలు నమ్మవద్దని సూచించిన మంత్రి.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని సాధించలేని వారు ప్రజలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు.
సతీమణి ప్రచారం
వనపర్తి జిల్లా అమరచింతలో నిర్వహించిన సమావేశంలో... మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి దేవికి మద్దతివ్వాలని పట్టభద్రులను కోరారు. రాష్ట్రానికి ఐటీఐఆర్ ప్రాజెక్టు వస్తే 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవని... పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలాల పరిధిలోని పలు పాఠశాలల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సతీమణి నీలిమ ప్రచారం నిర్వహించారు. పల్లాకు మొదటి ప్రాధాన్యత ఓటేసి మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం ఎలా లీక్ చేస్తుంది
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో... తెరాస, భాజపా విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నాయని పీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్ ఆరోపించారు. నిబంధనల ఉల్లంఘనలపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులో ఉండగా... ప్రభుత్వ ఉద్యోగులకు 29 శాతం ఫిట్‌మెంట్ ఇస్తున్నట్లు... ప్రభుత్వం ఎలా లీక్ ఇస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోకుండా... త్రిసభ్య కమిటీ నివేదిక ఇవ్వకుండా ఎలా ప్రకటన చేస్తారని నిలదీశారు.
పీఆర్సీ కోసం యాచించొద్దు
పట్టభద్రులు ఆలోచించి ఓటేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రచారంలో పాల్గొన్న ఆయన... బంగారు తెలంగాణ భాజపాతోనే సాధ్యమవుతుందని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలుపించాలని కోరారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలను భాజపా కైవసం చేసుకుంటుందని... ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లోని జోరాష్ట్రియన్ క్లబ్‌లో భాజపా పట్టభద్రుల ఎన్నికల సమావేశంలో... ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు పీఆర్సీ కోసం యాచించొద్దని... శాసించాలని సూచించారు.
బైక్ ర్యాలీ
కొత్తగూడెంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వామపక్షాల అభ్యర్థి జయ సారథిరెడ్డిని గెలిపించాలంటూ నిర్వహించిన ద్విచక్రవాహన ర్యాలీకి హాజరయ్యారు.
ఇదీ చూడండి : శివరాత్రికి సిద్ధమైన రాష్ట్రంలోని ఆలయాలు