KTR Rangareddy Tour : రాష్ట్రంలో అభివృద్ధి పనులను తెలంగాణ సర్కార్ పరుగులు పెట్టిస్తోంది. రాష్ట్ర మంత్రులు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రగతి పనుల శ్రీకారంలో బిజీగా ఉన్నారు. ఇవాళ కేటీఆర్ రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు.
KTR Rangareddy Visit : తెరాస ప్రభుత్వం ఎలాంటి రాజకీయలాభాపేక్ష లేకుండా పేదప్రజల అభివృద్ధే ధ్యేయంగా.. ముందుకు సాగుతోందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో జల్ పల్లి, తుక్కుకూడ, బడంగ్ పేట, మీర్ పేట మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నాలుగు మున్సిపాలిటీల్లో ఒకేరోజు రూ.400కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. హైదరాబాద్ సమీపంలో ఉన్నప్పటికీ అభివృద్ధి దూరంగా ఉన్న శివారు మున్సిపాలిటీపై ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR visit in Thukkugudem : మహేశ్వరం పరిధిలోని తుక్కుగూడలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కూరగాయలతో పాటు మాంసం విక్రయాలకు సంబంధించి మార్కెట్‌లో సదుపాయాలు కల్పించనున్నారు. సమీకృత మార్కెట్ నిర్మాణానికి 4 కోట్ల 50 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. 108 గదులతో వేర్వేరుగా వెజ్, నాన్ వెజ్ బ్లాక్‌లను నిర్మిస్తారు. 78 గదులతో కూరగాయల బ్లాక్, 30 గదులతో మాంసాహార బ్లాక్ అందుబాటులోకి తీసుకువస్తారు. తుక్కుగూడకు మంచినీటి పైప్‌లైన్ నిర్మాణానికి, జల్‌పల్లిలో రహదారుల విస్తరణకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లాలోనే మరికొన్ని అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టనున్నారు.
'జల్‌పల్లిలో ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. త్వరలో జల్‌పల్లిలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తాం. రూ.29 కోట్లతో జల్‌పల్లికి మరో రోడ్డు మంజూరు చేస్తాం. శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. పేద ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం.'
- కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి