తెలంగాణలో ఉత్పత్తులు, ఎగుమతులు, ఉపాధిని ప్రోత్సహించేందుకు కొత్తగా ఆరు ఇంజినీరింగు విడిభాగాల పార్కులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేడ్చల్, మెదక్ జిల్లాల్లోని మాదారం, రాయరావుపేట, రావుల్‌కోల్, దిండిగల్, సుల్తాన్‌పూర్, చిటుకుల్‌లో సుమారు 600 ఎకరాల్లో వీటిని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో అయిదు వేల ఇంజినీరింగు విడిభాగాల పరిశ్రమలుండగా.. మూడువేలకు పైగా రాజధాని చుట్టుపక్కల జిల్లాల్లో నడుస్తున్నాయి. 25 వేల మందికి పైగా పనిచేస్తున్నారు. ఈసీఐఎల్, బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, మిధాని, ఎన్‌ఎఫ్‌సీ సంస్థలకు రాష్ట్రం నుంచే విడిభాగాలు సరఫరా అవుతున్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలకూ ఇక్కడ నుంచే ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్ర ఎగుమతుల్లో 12 శాతం వాటా ఇంజినీరింగు విడిభాగాలదే ఉంది.
కొత్త పార్కులతో...
ఇంజినీరింగు విడిభాగాల పరిశ్రమలు ఏటా విస్తరించడంతో పాటు ఎగుమతులు పెరుగుతుండడంతో ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను సమీకరించి, భారీఎత్తున ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంజినీరింగు పరికరాలన్నీ ఒకేచోట లభ్యమయ్యేలా అవకాశాలు కల్పించేందుకు సన్నద్ధమైంది. దీనికోసం ఆరుచోట్ల ఇంజినీరింగు పార్కులను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. మేడ్చల్ జిల్లా మాదారంలో 350 ఎకరాలు, రాయరావుపేట 60, రావుల్‌కోల్ 50, దిండిగల్ 40, మెదక్ జిల్లాలోని సుల్తాన్‌పూర్ 50, చిటుకల్ 44 ఎకరాలలో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయగా భూముల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. రాయరావుపేటలో రోడ్ల నిర్మాణం చేపట్టారు. మిగిలిన చోట్ల మౌలిక వసతులను కల్పిస్తున్నారు.
అన్ని వసతులతో...
పారిశ్రామిక సమూహాల(క్లస్టర్) విధానంలో ప్రభుత్వం ఈ పార్కులను స్థాపిస్తుంది. ఇందులో ఇంజినీరింగు విడిభాగాల సూక్ష్మ పరిశ్రమలకు ప్రభుత్వం 300-400 గజాల మేరకు స్థలాలను ఇచ్చి.. మౌలిక వసతులు కల్పిస్తుంది. అక్కడ పరిశ్రమల స్థాపనకు రుణ సదుపాయాలు, మూలధన, పెట్టుబడి రాయితీలను ఇవ్వడంతో పాటు ఉమ్మడి సౌకర్యాల కేంద్రం నెలకొల్పుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పరిశ్రమల వారు ఈ పార్కులకు రావడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుంది. పార్కులను స్వాగతిస్తున్నామని, వాటిల్లో పరిశ్రమలను స్థాపించే చిన్న పారిశ్రామికవేత్తలకు రాయితీపై స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర సూక్ష్మ పరిశ్రమల సంఘం ప్రధాన కార్యదర్శి దామోదరాచారి కోరారు.
ప్రోత్సాహకాలు లభిస్తాయి
తెలంగాణలో ఇంజినీరింగు విడిభాగాల పరిశ్రమల కోసం ప్రత్యేక పార్కుల ఏర్పాటుతో ఈ రంగంలోని సూక్ష్మ పరిశ్రమలకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం కుషాయిగూడ, కాప్రా, బాలానగర్, పటాన్‌చెరు ప్రాంతాల్లోని చిన్న పరిశ్రమలు అద్దె గదుల్లో నడుస్తున్నాయి. పార్కుల్లో స్థాపించే పరిశ్రమలకు అన్ని విధాలా ప్రోత్సాహకాలు లభిస్తాయి.
- కె.సుధీర్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు
ఇదీ చదవండి: Etela Rajender leads in first round : తొలిరౌండ్లో భాజపా ముందంజ.. రెండో స్థానంలో తెరాస