ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను శాసన మండలిలో వినిపిస్తానని తెదేపా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్. రమణ అన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశానని.. 27 ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్న తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా ఎల్. రమణ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా హయాంలోనే ఈ మూడు జిల్లాలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు.
ఉద్యోగాల కల్పన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని.. తెరాస ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వలేదని రమణ ఆరోపించారు. రాష్ట్రంలో భూ, డ్రగ్, ఇసుక మాఫియా ఎక్కువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ ఇవ్వలేదని.. కరోనా సమయంలో ప్రజలను గాలికి వదిలేసిందని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు