Tammineni Veerabhadram: సీపీఎం రాష్ట్ర నూతన కార్యదర్శిగా మూడో సారి తమ్మినేని వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 15మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా, 60మంది సభ్యులతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా ఎస్. వీరయ్య, సీహెచ్ సీతారాములు, జి. నాగయ్య, చుక్కా రాములు, బి. వెంకట్, టి. జ్యోతి, జూలకంటి రంగారెడ్డి, పి. సుదర్శన్, డీజీ నర్సింహారావు, జాన్ వెస్లీ, పాలడుగు భాస్కర్, టి. సాగర్, ఎండీ అబ్బాస్, మల్లు లక్ష్మి ఎన్నికయ్యారు. గత నాలుగు రోజులుగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని ఓ గార్డెన్లో జరిగిన మహాసభలు ముగిశాయి.
54 తీర్మానాలు
రాష్ట్ర మహాసభల్లో 54 తీర్మానాలు చేశారు. అందులో అందులో ప్రధానమైనవి రాష్ట్రంలో ప్రజారోగ్య సేవలు మెరుగు చేయాలి, గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం 10శాతానికి రిజర్వేషన్ పెంచాలి, కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, ఆదివాసీల అభివృద్దికి ప్రత్యేక ప్రణాళిక అమలుచేయాలి, తండాల అభివృద్దికి 2వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలి, పోడు భూముల దరఖాస్తులను తక్షణం పరిశీలించి హక్కు పత్రాలు ఇవ్వాలి అని తీర్మానాలు చేశారు.
కౌంట్‌డౌన్ ప్రారంభమైంది..
మూడోసారి తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలని, కార్యదర్శి పదవి అనేది కిరీటం కాదు... బాధ్యతగా భావిస్తున్నానని తమ్మినేని వీరభద్రం అన్నారు. గత ఏడేళ్లుగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగించాయని, ఇటీవల కాలంలో రైతు పోరాటాలు, కార్మిక పోరాటాలు, నిరుద్యోగ యువత ఆలోచనలు చూసినా మోదీ, కేసీఆర్‌ల కౌంట్‌డౌన్ ప్రారంభమైందని అర్థమవుతోందన్నారు. వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా గెలిచే అవకాశం లేదని, ప్రజల ఆలోచనలను అర్థం చేసుకుని, మహాసభల్లో చేసిన నిర్ణయాలు సక్రమంగా అమలు చేయగలిగితే ప్రజా ఉద్యమం ముందుకు సాగుతుందని విశ్వాసంతో కార్యదర్శిగా తన పాత్రను సక్రమంగా పోషిస్తానని తెలిపారు.
ఇదీ చదవండి: