Ramanuja Sahasrabdi Utsav : సమతామూర్తి కేంద్రంలో రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు కోలాహలంగా జరుగుతున్నాయి. యాగశాలలో శ్రీ లక్ష్మీనారాయణ యాగం యథాతథంగా కొనసాగుతోంది. మూడోరోజు చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రధాన యాగశాల మండపంలో 9 మంది జీయర్ స్వాములు మంత్ర అనుష్టానం చేశారు. సుమారు గంటపాటు ఈ మంత్ర అనుష్టానం జరిగింది. ఈ అనుష్టానం వల్ల మన చుట్టూ ఉండే వాతావరణం పవిత్రమవుతుందని చినజీయర్ స్వామి తెలిపారు. అనంతరం సమతామూర్తి కేంద్రంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
మధ్యాహ్నం రెండున్నరకు యుజుర్వేద పండితులు భక్తులకు పుణ్యవచనాలు బోధించారు. అనంతరం చినజీయర్‌స్వామి సమక్షంలో విష్ణుసహస్ర పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు స్వామీజీ వేదపఠనం చేశారు.
సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు
సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు శ్రీరామనగరం సుందరంగా ముస్తాబవుతోంది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా శనివారం... సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేయనున్నారు. ప్రాంగణాన్ని వందలాది రకాల పుష్పాలతో అలంకరిస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో 10 టన్నుల 180 రకాల పూలు, 50 రకాల పండ్లు, కూరగాయలతో సమతామూర్తి కేంద్రాన్ని, 108 దివ్యదేశాలను అలంకరిస్తున్నారు. ఇందుకోసం చిత్తూరు, బెంగళూరు నుంచి పూలు, పండ్లను తెప్పించారు. నాలుగు రోజుల నుంచి 600 మంది సిబ్బంది నిరంతరంగా అలంకరణ పనుల్లో నిమగ్నమయ్యారు. పుష్ప అలంకరణ పనులను స్వయంగా శ్రీత్రిదండి చినజీయర్ స్వామి పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. పూర్తిగా రకరకాల పుష్పాలతో సమతామూర్తి విగ్రహాన్ని తయారు చేసిన సిబ్బందిని చినజీయర్ స్వామి ఆశీర్వదించారు.
ఇదీ చూడండి: Statue of Equality: శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రేపే అత్యంత కీలక ఘట్టం