Statue of Equality Inauguration : ఫిబ్రవరి 2న ప్రారంభం కానున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. 14వ తేదీ వరకు కన్నులపండువగా జరగనున్న ఈ ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. దేశవిదేశాల నుంచి చాలా మంది ప్రముఖులు ఈ ఉత్సవాలకు హాజరుకానున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
రేయింబవళ్లు శ్రమిస్తున్న కార్మికులు
Sri Ramanujacharya statue Inauguration : సమతాస్ఫూర్తి కేంద్రం కొలువైన 45 ఎకరాల్లో పనులు వేగంగా సాగుతున్నాయి. చదును పనులు తుది దశకు చేరుకున్నాయి. కేంద్రం చుట్టూ పచ్చదనం ఏర్పాటు పనులు పూర్తి కావొచ్చాయి. రెండు రోజుల్లో కొలిక్కి తీసుకువచ్చేలా కసరత్తు జరుగుతోంది. వందలాది మంది కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. 108 దివ్య ఆలయాల ఫ్లోరింగ్ పనులు చకాచకా సాగుతున్నాయి. భద్రవేదిలోని అంతస్తులను శుభ్రం చేస్తున్నారు. రెండో అంతస్తులో 120 కిలోల బంగారు రామానుజాచార్యుల మూర్తిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
వివిధ మార్గాలు ఇలా..
Sri Ramanujacharya Millenium Celebration : సమారోహ ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి భక్తులు హాజరు కానున్నారు. దీనికి తగ్గట్టుగా రాకపోకలకు వీలుగా రహదారుల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. సమతాతిస్ఫూర్తి కేంద్రానికి చేరుకునేందుకు వేర్వేరు మార్గాలను సిద్ధం చేశారు. ఇప్పటికే 5 కిలోమీటర్ల పొడవునా మదనపల్లి నుంచి పది మీటర్ల వెడల్పున రూ.17.5 కోట్లతో సిమెంటు రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. శ్రీరామనగరం ఆశ్రమం వద్ద జంక్షన్లు అభివృద్ధి చేసి తారు వేసి చదును చేశారు. గొల్లపల్లి నుంచి పెద్దగోల్కొండ జంక్షన్ వరకు రహదారిని నిర్మించి పీ7 రోడ్డుకు అనుసంధానించారు. దీనివల్ల ఎయిర్‌పోర్టుకు కొత్త మార్గం అందుబాటులోకి వచ్చింది. అలాగే పీ7 రోడ్డును ఆరు లేన్లుగా విస్తరించి ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేశారు. తొండుపల్లి జంక్షన్ నుంచి గొల్లపల్లి వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి. పెద్దషాపూర్ తండా, బూర్జుగడ్డ తండాల మీదుగా వెళ్లే రహదారులను విస్తరించారు. రూ.1.50 కోట్లతో 11/33కేవీ సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడంతో విద్యుత్తు పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అధికారులు చెబుతున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!