హైదరాబాద్ జంట నగరాల్లోని చెరువులు కబ్జాలకు గురయ్యాయి. ఒకప్పటి చెరువుల స్థలాల్లో.. నేడు పదుల సంఖ్యలో కాలనీలు వెలిశాయి. దీనికి తోడు చెత్తా చెదారం, భవన నిర్మాణ శిథిలాలతో నగరంలోని చాలా చెరువుల రూపురేఖలు మారిపోయాయి. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లాలోని జల్పల్లి పెద్ద చెరువు విస్తీర్ణం సగానికి తగ్గిపోయింది. ఫలితంగా వర్షం పడితే చాలు.. రోడ్లపైకి వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోతున్నాయి.
అడ్డూ అదుపు లేదు..
జల్పల్లి చెరువుకు జల్పల్లి గ్రామంతో పాటు మామిడిపల్లి, పహాడీషరీఫ్ చెరువుల నీరు నీరు వచ్చి చేరుతుంది. జల్పల్లి చెరువు పూర్తి విస్తీర్ణం 299 ఎకరాలు కాగా.. సుమారు 100 ఎకరాల వరకు కబ్జాకు గురై, ప్రస్తుతం 199 ఎకరాల్లో మాత్రమే చెరువు ఉంది. దీనికి తోడు 100కు పైచిలుకు ఎకరాల్లో ఎఫ్టీఎల్లో పట్టాదారులు ఉన్నారు. నిబంధనల ప్రకారం చెరువు శిఖం భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. పట్టాదారులు అయినప్పటికీ కేవలం నీరు లేనప్పుడు పంట వేసుకోవచ్చు. కానీ ఇక్కడి ఎఫ్ టీఎల్ పరిధిలో మొత్తం భవణ నిర్మాణాలు చేపట్టారు. పలువురు ఇళ్లు నిర్మించుకోగా.. ఇంకొందరు గోదాంలు నిర్మించుకున్నారు. మిగతా ప్రాంతాల్లో ఎఫ్ టీఎల్ పరిధితో పాటు.. చెరువు భూముల్లో సైతం వెంచర్లు వేస్తున్నారు.
రహదారులపైకి నీరు..
జల్పల్లి చెరువులో ఆక్రమణలు ఎక్కువ కావడం వల్ల ఇటీవల కురిసిన వర్షానికి జల్పల్లిలో ప్రధాన రహదారి నీట మునిగింది. రాకపోకలు స్థంభించిపోయాయి. మైలార్దేవునిపల్లి నుంచి జల్పల్లి వెళ్లే రహదారిపై నీరు ఇంకా నిలిచే ఉంది. పహాడీషరీఫ్ నుంచి జల్పల్లికి వెళ్లే రహదారిని మూసివేశారు. ఈ నేపథ్యంలో పహాడీషరీఫ్ నుంచి జల్పల్లి వెళ్లేందుకు దాదాపు 6 కిలో మీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
30 వేల మందిపై ప్రభావం..
జల్పల్లి చెరువు నిండితే.. దాని ప్రభావం జల్పల్లిలోని సుమారు 30 వేల జనాభాపై పడుతోంది. జల్పల్లి శివారు కాలనీలు, గోదాముల్లోకి వరద నీరు వస్తోంది. జల్పల్లి చెరువు నుంచి పిరంగి నాలా ద్వారా ఇతర చెరువుల్లోకి నీరు వెళ్లి, అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం చెరువు వైపునకు వెళ్తాయి. కానీ పిరంగి నాలా మొత్తం కబ్జాకు గురి కావడం వల్ల నీరు గ్రామంలోకి వస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలతో శ్రీరామ్ నగర్ కాలనీ, పి-7 రోడ్డు వైపు కట్ట తెగి లక్ష్మీగూడ, వాంబే కాలనీ ముంపులో చిక్కుకున్నాయి.
ఈ నేపథ్యంలో నాయకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో వల్లే కబ్జాలు ఎక్కువయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కబ్జాలను ఆపాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి.. కబ్జాదారుల కోరల్లో పెద్ద చెరువు.. మోక్షం ఎప్పటికో!