Vanasthalipuram Girls discovered Asteroid: చదువు, శాస్త్రీయ కళలను అభ్యసించడంతో పాటు ఆ అక్కాచెల్లెళ్లు శ్రియ, సిద్ధిక్ష ఖగోళంపై కన్నేశారు.. న్యూదిల్లీకి చెందిన స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్, స్టీమ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థలో వీరు శిక్షణ పొందారు. తద్వారా గత ఏప్రిల్‌లో ఆస్టరాయిడ్ సెర్చ్ క్యాంపెయిన్‌లో పాల్గొని ఓ గ్రహ శకలాన్ని కనుగొన్నారు. వీరు హైదరాబాద్‌లోని వనస్థలిపురం నర్సింహారావునగర్‌లో నివసించే డా.చైతన్య, విజయ పాళ్యం కుమార్తెలు. హయత్‌నగర్‌లోని మౌంట్ లిటరా జీ స్కూల్‌లో శ్రియ(14) పదో తరగతి, సిద్ధిక్ష (9)ఐదో తరగతి చదువుతున్నారు.
ఆవిష్కరణకు గుర్తింపు
చిన్న వయసులోనే పాన్‌స్టార్స్ టెలిస్కోప్ ద్వారా తీసిన ఛాయాచిత్రాలను విశ్లేషించిన ఈ అక్కాచెల్లెళ్లు బృహస్పతి, అంగారక గ్రహాల మధ్య మెయిన్ బెల్ట్ ఆస్టరాయిడ్‌లోని ఒక ఉల్కను కనుగొన్నారు. వీరి ఆవిష్కరణకు సోమవారం ‘2021 జీసీ 103’గా గుర్తింపునిచ్చారు. ఈ ఆవిష్కరణ త్వరలో పారిస్‌లోని అంతర్జాతీయ అస్ట్రోనామికల్ యూనియన్, నాసా నిర్వహించే వరల్డ్ మైనర్ బాడీ కేటలాగ్‌లో భాగం కానుంది. వీరి కృషిని గుర్తించిన టెక్సాస్‌లోని హార్డిన్-సిమన్స్ విశ్వవిద్యాలయంతో పాటు ఏఐఎస్‌సీ(ఇంటర్నేషనల్ అస్ట్రోనామికల్ సెర్చ్ కోలాబిరేషన్) ధ్రువపత్రాలు అందజేశాయి.
అక్కాచెల్లెళ్ల ఘనత
హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆన్‌లైన్‌లో ఫైథాన్‌తో డేటాను విజువలైజ్ చేసే కోర్సును అభ్యసిస్తున్నట్లు శ్రియ తెలిపింది. కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నానని గాయనిగా రాణించేందుకు కృషి చేస్తున్నానంటోంది. సిద్ధిక్ష కూచిపూడి నృత్యకారిణిగా రాణిస్తూ ఇటీవలే నాట్య రవళి పురస్కారం పొందింది. చండీగఢ్‌లోని ప్రాచీన్ కళా కేంద్రం నుంచి కర్ణాటక సంగీతంలో పీపీ1 గాత్ర పరీక్షలో డిస్టింక్షన్ సాధించింది.
ఇదీ చదవండి: Varun Singh: మృత్యువుతో పోరాడి ఓడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్