TS Schools to Reopen: ఫిబ్రవరి 1 న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. వచ్చే నెల ఒకటి నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను పునఃప్రారంభించనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలన్నింటినీ ఫిబ్రవరి 1 న తిరిగి ప్రారంభించాలని ఆదేశిస్తూ వివిధ విభాగాలకు విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.
సెలవుల్లో ఆన్లైన్ తరగతులు
కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నెల 8 నుంచి కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యాసంస్థలకు కొనసాగుతున్న సెలవులు రేపటితో ముగియనున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఈనెల 30 వరకు సెలవులను పొడిగించారు. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మాత్రం ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఇతర వృత్తివిద్యా కశాశాలల్లో కూడా టీవీ, ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10 తరగతులకు మాత్రమే టీ శాట్, దూరదర్శన్, వాట్సాప్ ద్వారా బోధన కొనసాగుతోంది.
ప్రత్యక్ష తరగతులకే మొగ్గు
మహారాష్ట్ర, దిల్లీ, ఏపీ, హరియాణా, తమిళనాడు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు తెరవనున్నందున... రాష్ట్రంలోనూ విద్యా సంస్థలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపింది. మరోవైపు రాష్ట్రంలో పాజిటివిటీ రేటు తక్కువగానే ఉందని.. పిల్లలపై ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా లేదన్న వైద్య నిపుణుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని ఉపాధ్యాయ, తల్లిదండ్రుల సంఘాలు, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి ఒత్తిడి వస్తున్నట్లు విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో విద్యాసంస్థల పునఃప్రారంభంపై సర్కారు నిర్ణయం తీసుకుంది.
హైకోర్టులో ప్రస్తావన
బడుల ప్రారంభంపై శుక్రవారం.. హైకోర్టులో సైతం ప్రస్తావనకు వచ్చింది. పాఠశాలల విద్యార్థులు టీకాలు కూడా వేసుకోలేదని.. మరోవైపు కరోనా తీవ్రత కొనసాగుతోందని న్యాయవాదులు ఆందోళన వెలిబుచ్చారు. పాఠశాలల ప్రారంభంపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. ఈ అంశంపై ఫిబ్రవరి 3న విచారణ చేపడతామని తెలిపింది.
ఇదీ చదవండి: Harish Rao on Unemployment: 'నిరుద్యోగం రాష్ట్రంలో ఎక్కువుందా..దేశంలోనా?'