School Student lost his Legs in Accident : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం రాయికల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ప్రమాదానికి గురై తన రెండు కాళ్లు కోల్పోయాడు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం ప్రకారం. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం గంగాధర్‌పల్లి గ్రామపంచాయతీ కుంటలోపు తండాకు చెందిన నీల, తావుర్యా దంపతుల కుమారుడు అశోక్ (8) రాయికల్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. పాఠశాల విడిచిన తర్వాత సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి రాయికల్ గ్రామ శివారులో రోడ్డుపై బస్సు కోసం వేచి ఉన్నాడు.
షాదనగర్ నుంచి సూరారం వెళ్లే బస్సు రాగానే విద్యార్థులు ఆ వెహికల్ వెంట పరిగెత్తారు. బస్సు ఎక్కే ప్రయత్నంలో అశోక్ ఆ వాహనం వెనుక టైర్ల కింద పడగా బస్సు రెండు కాళ్లపై నుంచి వెళ్లింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స కోసం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విద్యార్థిని కుటుంబ సభ్యులు శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.