రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి అధికంగా ఉండడం వల్ల కొవిడ్ నిబంధనలు కఠితరం చేయాలని శంషాబాద్ ఎయిర్ పోర్టు యాజమాన్యం నిర్ణయించింది. రాత్రి కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ డొమెస్టిక్, అంతర్జాతీయ విమానాలు యథావిధిగా తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టు లోపల, పరిసర ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలు అధికంగా ఉన్నట్లు జీఎంఆర్ యాజమాన్యం గుర్తించింది.
పలుమార్లు శంషాబాద్ సివిల్ పోలీసులు... ఎయిర్ పోర్టు లోపల జరుగుతున్న ఉల్లంఘనలపై జరిమానా విధిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఉల్లంఘనదారులను నిలువరించే అధికారం జీఎంఆర్ యాజమాన్యానికి లేకపోవడం వల్ల ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. పోలీసులకు ఉండే అధికారాలను తమకు బదలాయించినట్లయితే.. కొవిడ్ నిబంధనలు అమలకు తాము ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. తమ సిబ్బందికి ఉల్లంఘనలను ఎలా గుర్తించాలి? ఏ విధంగా ఫొటోలు తీసి చట్ట ప్రకారం జరిమానా విధించాలనే అంశాపై శిక్షణ ఇవ్వాలని కోరింది.
ప్రత్యేకంగా 20 మంది…
ఎయిర్ పోర్టు యాజమాన్యం విజ్ఞప్తిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం... 20 మందిని ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోడానికి అనుమతి ఇచ్చింది. వీరికి శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు ఉల్లంఘనలపై శిక్షణ ఇస్తారు. పోలీసు చలానా వెబ్‌సైట్ వీరికి అందుబాటులోకి తెస్తారు. ఇలా చేయడం ద్వారా ఎయిర్పోర్టు ఆవరణలోకాని, లోపలకాని కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలు... ప్రధానంగా మాస్కు ధరించకపోవడం, భౌతిక దూరాన్ని పాటించకపోవడం లాంటివి జరిగినట్లయితే తక్షణమే గుర్తించి ఉల్లంఘణదారులకు జరిమానా విధిస్తారు.
త్వరలో శిక్షణ…
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా త్వరలోనే జీఎంఆర్ యాజమాన్యం సూచించిన 20 మందికి శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో శిక్షణ ఇస్తారు. అనంతరం పోలీసు చలానా వెబ్‌సైట్ వారికి అందుబాటులోకి తెస్తామని డీసీపీ ప్రకాశ్ రెడ్డి చెప్పారు. ఇలా చేయడం ద్వారా తమ సిబ్బంది ఎయిర్ పోర్టులో, పరిసర ప్రాంతాల్లో ఉల్లంఘనలపై దృష్టి పెట్టాల్సిన పని లేదని ఆయన తెలిపారు.