రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్ పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా వాహనదారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. రోడ్డు భద్రతా నియమాలు పాటించకుండా, వాహనం నడపడం రాకపోయినా రోడ్లమీదకు వచ్చి అమాయకుల ప్రాణాలు బలితీసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. వేలల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాదిలో ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 282 మంది ప్రాణాలు కోల్పోయారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1,450 రోడ్డు ప్రమాదాలు జరగగా 1,363 మంది గాయాలపాలయ్యారు. ఇందులో వెనుక నుంచి వాహనాలు ఢీకొట్టిన కేసులే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అకస్మాత్తుగా వాహన దిశ మార్చడంతో వెనుక ఉన్న వాహనాలు ఢీకొంటున్నాయి. ఈ తరహా ప్రమాదాలు 550 జరగగా 61 మంది ప్రాణాలు కోల్పోయారు. 478 మంది గాయపడ్డారు. అతి వేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనం నడిపిన కారణంగా పాదాచారులను ఢీ కొట్టిన 282 ప్రమాదాల్లో 79 మంది మరణించారు.
ఎదురెదురుగా ఉన్న వాహనాలు ఢీ కొట్టిన ప్రమాదాలు 276 జరగగా 50 మంది మరణించారు. 345మంది గాయపడ్డారు. అతివేగం, మద్యం మత్తుల్లో తనంతట తానే వాహనంపై నుంచి కింద పడిపోయిన 183 ప్రమాదాల్లో 50 మంది మరణిచారు. 173 మంది గాయపడ్డారు. ఇలా ఈ ఏడాది జరిగిన 1450 రోడ్డు ప్రమాదాల్లో 282 ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: వ్యాక్సినేషన్‌పై కేంద్రానికి సుప్రీం ప్రశ్నలు