ధరణి వద్దు... పాతపద్ధతే ముద్దు అంటూ 84గ్రామాల్లోని ప్లాట్లను పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్ చేయాలని రియల్ ఎస్టేట్ అసోసియేషన్, వివిధ ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ప్రజలకు శాపంగా మారిన ధరణిని ఎత్తివేయాలని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలో స్థిరాస్తి వ్యాపారులు డప్పు దరువుల నడుమ ఆటపాటలతో ప్లకార్డులతో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపైన ఆందోళనకు దిగారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలదండ వేసి... అనంతరం ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కరోనా వైరస్ వల్ల ఇప్పటికే చాల నష్టం వాటిల్లిందని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉప్పరి శ్రీనివాస్ అన్నారు. దీనికి తోడు సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల కోలుకోలేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. భద్రత కల్పిస్తామని ధరణి తీసుకొచ్చి లక్షల ఎకరాల భూములను మాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇది తమ ఆత్మగౌరవం కోసం సాగుతున్న ఆరంభ పోరాటం మాత్రమేనని లేకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన నూతన పద్ధతి రిజిస్ట్రేషన్ వల్ల సామాన్యుల కుటుంబంలో భూములు కొనడం గగనమైందని ఏఐఏవైఎస్ రాష్ట్ర కార్యదర్శి బేగరి రాజు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు గుదిబండగా మారిన 111జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాలు, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు, ఏకే గ్రూప్ రియల్ ఎస్టేట్ ఛైర్మన్ అన్వర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నాతో ట్రాఫిక్‌కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి: 'జనవరి తొలివారం నుంచి ఉచిత తాగునీటి సరఫరా'