పల్లెల్లో నిలిచిపోయిన నిర్మాణ పనులన్నీ పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ బుధవారం ఆదేశాలు చేశారు. రాష్ట్రంలో మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ విధించగా.. మరుసటి రోజు నుంచి లాక్‌డౌన్‌తో పనులన్నీ పడకేశాయి.
ఔషధ, కిరాణా దుకాణాలకు మాత్రమే మినహాయింపు లభించింది. చిన్న పరిశ్రమలు సైతం మూతబడ్డాయి. ఇప్పుడు పలు రకాల పరిశ్రమలు, దుకాణాలు తెరిచేందుకు అనుమతులు ఇవ్వడం వల్ల గ్రామీణులకు ఉపాధి లభించి, ఆర్థికంగా కొంత ఊరట కలగనుంది.
సాయంత్రం ఆరు వరకే...
ప్రస్తుతం అనుమతించిన దుకాణాలు, పరిశ్రమలు సాయంత్రం ఆరు గంటల వరకే పనిచేస్తాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయా పనులు నిర్వహిస్తున్న సమయంలో పరిశ్రమలు, దుకాణాల వద్ద కచ్చితంగా మాస్కులు ధరించి.. వ్యక్తిగత దూరం పాటించాలని ఆదేశాలిచ్చారు.
దుకాణాలు, పనులు జరిగే ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాల్సి ఉంది. కార్మికులు.. దుకాణాలు, పరిశ్రమల నిర్వాహకులకు తగిన మినహాయింపులు ఇవ్వాలని సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
అనుమతించేవి ఇవే...
నిర్మాణ పనులు, స్టోన్ క్రషర్లు, ఇటుకల తయారీ, చేనేత, మరమ్మతుల దుకాణాలు, బీడీ తయారీ, ఇసుక మైనింగ్, సిరామిక్, రూఫ్ టైల్స్, సిమెంటు పరిశ్రమలు, జిన్నింగ్ మిల్స్, ఇనుము-స్టీల్ పరిశ్రమలు, ప్లాస్టిక్, శానిటరీ పైపుల దుకాణాలు, కాగిత పరిశ్రమ, పరుపుల తయారీ, ప్లాస్టిక్-రబ్బర్ తయారీ, ఇతరత్రా వస్తువుల విక్రయ దుకాణాలు.
ఇటుక బట్టీల్లో జోరుగా పనులు...
ఇప్పటికే జిల్లాలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఆరు మినహా మిగతా 554 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం జరుగుతున్న పనులకు దాదాపు 89వేల మంది హాజరవుతున్నారు. లాక్‌డౌన్ కాలంలో ఉపాధి పనులు పేదలకు అండగా నిలుస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కొందుర్గు, కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, చౌదరిగూడ, కేశంపేట, మహేశ్వరం మండలాల్లో ఇటుక బట్టీలు అధికంగా ఉన్నాయి. ఇక్కడ స్థానికులతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 22వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇటుక బట్టీల్లో పనులకు అనుమతి దక్కడం వల్ల ఆ కార్మికులకు చేతినిండా పని దొరకనుంది.