రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ అందుబాటులోకి రాబోతుంది. సుమారు 105 ఎకరాల్లో రూ.800 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా కొండకల్‌లో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రూపుదిద్దుకోనుంది. రాష్ట్రానికే తలమానికైన కోచ్ ఫ్యాక్టరీకి మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ భూమిపూజ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే విమానాలు, హెలికాప్టర్‌ల విడిభాగాలు, ట్రాక్టర్ల తయారీ జరుగుతోందని ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావడం సంతోషకరంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేవారు స్థానికంగా ఉన్న యువతకు 60 శాతం ఉపాధి అవకాశాలు కల్పిస్తే టీఎస్-ఐపాస్ ద్వారా అదనపు అవకాశాలు కల్పిస్తామన్నారు. మేధా కోచ్ ఫ్యాక్టరీ ద్వారా 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ఖాజీపేట హామీ ఎక్కడ..?
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇచ్చిన హామీ మేరకు తక్షణం ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కేటీఆర్ కోరారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందేమాతరం వంటి రైళ్లతో పౌరుల జీవన విధానంలో మార్పు వస్తుందన్నారు. నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటుచేసి స్థానిక యువతను ప్రోత్సహించాలని ఎంపీలను కోరారు.
2023 అందుబాటులోకి
మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని 2023 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. 15 నుంచి 18 నెలల్లో మొదటి యూనిట్, కోచ్‌ను సిద్ధం చేస్తామని సంస్థ ఎండీ కశ్యప్ రెడ్డి పేర్కొన్నారు. ఏడాదికి 500 రైల్వే కోచ్‌లు, 50 లోకోమోటివ్ల తయారీ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి : 'దళారులు, నాయకులను నమ్మకుండా పనిచేయాలి'