రాష్ట్రంలో బలైమన శక్తిగా ఎదిగిన తెరాస..కేంద్రంలో బలపడేందుకు పావులు కదుపుతోంది. భాజపా కూడా తెలంగాణ గట్టుపై ప్రచారపర్వం మొదలు పెట్టింది. కాంగ్రెస్ సైతం అధికార పార్టీని ఢీకొట్టేందుకు రంగంలోకి దిగుతోంది. గత తప్పిదాలు పునరావృతం కాకుండాఅస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతోంది. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీతో లోక్సభ ఎన్నికలకు సమరశంఖం పూరిస్తోంది. శనివారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రచార పర్వాన్ని మొదలు పెడుతోంది.
కనీస ఆదాయ వాగ్దానం
ఇప్పటికే రాఫెల్ వ్యవహారంలో కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రాహుల్..శనివారం సాయంత్రం శంషాబాద్లో నిర్వహించే సభలో కొత్తపథకాలతో ఆకట్టుకోబోతున్నారు. కనీస ఆదాయ పథకం పేరుతో కొత్త స్కీంను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అందుకే ఈ సభా వేదికకు కనీస ఆదాయ వాగ్దాన సభగా నామకరణం చేశారు. రాహుల్ ప్రకటించే ఈ పథకం ఓట్లు రాలుస్తుందనే అంచనాలో హైకమాండ్ పెద్దలున్నారు.
నేతలు చేజారకుండా..
మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ వలలో పడుతున్నారు. ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. ఇంకొందరు కారెక్కుతారనే ఆందోళన టీపీసీసీ వర్గాల్లో ఉంది. వారిలో నైరాశ్యాన్ని తొలగించి నూతనొత్తేజం కలిగించనున్నారు రాహుల్. వచ్చేది తమ ప్రభుత్వమేనని, ముందుంది మంచికాలమని భరోసా కల్పించనున్నారు. మొత్తానికి రాహుల్ సభను విజయవంతం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకెళ్లాలని హస్తం నేతలు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:కాంగ్రెస్ చేవెళ్ల సెంటిమెంట్ ఫలించేనా..?