President Ramnath Unveiled Gold statue of Ramanuja: ముచ్చింతల్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. శ్రీరామనగరం అద్వైత, సమతా క్షేత్రంగా విరాజిల్లుతుందని పేర్కొన్నారు. సమతామూర్తి రామానుజుల స్వర్ణమూర్తిని నెలకొల్పి చినజీయర్‌స్వామి చరిత్ర లిఖించారని.. స్వర్ణమూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేయడం సంతోషంగా ఉందని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని సమతామూర్తి కేంద్రంలో.. జగద్గురు రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండుగ శోభాయమానంగా సాగుతోంది. 54 అంగుళాల సమతామూర్తి 120 కిలోల స్వర్ణ ప్రతిమను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించి.. లోకార్పణం చేశారు. స్వర్ణమూర్తి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సమతామూర్తి బంగారు విగ్రహానికి రాష్ట్రపతి దంపతులు ప్రత్యేక పూజలు చేసి తొలి హారతి ఇచ్చారు. బంగారు శఠారితో రాష్ట్రపతిని చినజీయర్ స్వామి ఆశీర్వదించారు. భద్రవేదిలోని మొదటి అంతస్తులో జరిగిన ఈ కార్యక్రమంలో.. వేలాది మంది రుత్వికులు వేద మంత్రోచ్చారణలతో ఘోషించారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక వేదికపై ఆశీనులైన ఆయన.. రామానుజాచార్యుల విశిష్టతను కొనియాడారు.
ఆధ్యాత్మిక కేంద్రంగా
"స్వర్ణమూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేయడం సంతోషంగా ఉంది. సమతాస్ఫూర్తి కేంద్రంలో 108 దివ్యక్షేత్రాలకు ప్రాణప్రతిష్ఠ జరిగింది. ముచ్చింతల్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది. శ్రీరామనగరం అద్వైత, సమతా క్షేత్రంగా విరాజిల్లుతుంది. భక్తి మార్గాన్ని, ధర్మమార్గాన్ని రామానుజాచార్యులు నిర్దేశించారు. సర్వమానవ సమానత్వాన్ని రామానుజులు ఆచరించమని చెప్పారు. మానవజీవన విధానంలో విశిష్టాద్వైతం అంతర్భాగం. గోదావరి నది ఆశీర్వాదంతో సమతామూర్తిని అద్భుత క్షేత్రంగా నెలకొల్పారు." -రామ్‌నాథ్ కోవింద్, భారత రాష్ట్రపతి
దక్షిణాది నుంచి ఉత్తరాదికి
రామానుజులు సామాజిక అసమానతలు రూపుమాపారని రాష్ట్రపతి అన్నారు. బడుగు వర్గాలకు దైవ దర్శనం ప్రాప్తి కోసం పాటుపడ్డారని గుర్తు చేశారు. ప్రజల్లో భక్తి, సమానత కోసం రామానుజులు కృషిచేశారని.. దేశంలోని పలు ప్రాంతాల్లో తన సందేశాలతో చైతన్యం నింపారని పేర్కొన్నారు. వసంతపంచమి రోజు ప్రధాని మోదీ సమతామూర్తి ప్రతిమను ఆవిష్కరించారని వెల్లడించారు. భక్తితో ముక్తి లభిస్తుందని రామానుజులు చెప్పారని రాష్ట్రపతి అన్నారు. సాంస్కృతిక విలువల ఆధారంగా దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చారని కొనియాడారు. భారత్‌లో భక్తి మార్గం దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లిందని.. ఉత్తర భారత్ సాధువులు రామానుజుల సిద్ధాంతాలతో ప్రభావితమయ్యారని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగ నిర్మాణానికి అంబేడ్కర్ ఉత్తమ ఆర్కిటెక్చర్ అని.. మహాత్మాగాంధీపైనా రామానుజాచార్యుల ప్రభావం ఉందని అభిప్రాయపడ్డారు.
అసమానతలు రూపుమాపాలి
అంతకుముందు రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతికి చినజీయర్ స్వామి సాదర స్వాగతం పలికారు. సమతా సిద్ధాంతాలను రామానుజులు ప్రపంచవ్యాప్తం చేశారని వెల్లడించారు. అన్ని వర్గాలు సమానమే అని రామానుజులు చాటి చెప్పారని.. భగవంతుడి ఆరాధనకు అన్ని వర్గాలు అర్హులేనని చెప్పారన్నారు. రామానుజుల స్ఫూర్తితో అసమానతలు రూపుమాపేందుకు యత్నిస్తామని వెల్లడించారు.
ఎన్నో ప్రత్యేకతలు
విగ్రహావిష్కరణకు ముందుగా సమతామూర్తి కేంద్రంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. 216 అడుగుల రామానుజ విగ్రహాన్ని సందర్శించారు. దివ్యక్షేత్రంలోని 108 వైష్ణవ ఆలయాలను దర్శించుకున్నారు. సమతాస్ఫూర్తి కేంద్రం విశేషాలను రాష్ట్రపతికి చినజీయర్‌స్వామి వివరించారు. ఇక బంగారు సమతామూర్తి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. విగ్రహాన్ని పూర్తిగా ముచ్చింతల్‌లోని జీవాశ్రమంలోనే తయారు చేశారు. మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వరరావు 27 కిలోల బంగారాన్ని విరాళమిచ్చారు. అమెరికాకు చెందిన మరో భక్తురాలు 8 కిలోలు అందించారు. ఆశ్రమంలో పనిచేసే కార్మికులు తమ వంతుగా సహాయం చేశారు. ఇలా ఎందరో విరాళంగా ఇచ్చిన బంగారంతో 54 అంగుళాల రామానుజ ప్రతిమను రూపొందించారు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని రామానుజులు విశ్వవ్యాప్తం చేశారు. సర్వమానవ సమానత్వ సూత్రం ప్రబోధించారు.
విహంగ వీక్షణం
బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న రాష్ట్రపతికి.. గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్లో ముచ్చింతల్‌కు బయలుదేరిన రాష్ట్రపతి దంపతులు.. విహంగ వీక్షణం ద్వారా సమతామూర్తిని తిలకించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్రానికి చేరుకున్న రాష్ట్రపతికి.. చినజీయర్ స్వామి స్వాగతం పలికారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ముచ్చింతల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముచ్చింతల్ వరకు సుమారు 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. భక్తులకు, సందర్శకులకు మధ్యాహ్నం ఒంటి గంట వరకే అనుమతి ఇచ్చారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం