శ్రీరామచంద్ర మిషన్ వ్యక్తిగత మార్పునే కాదు సమాజంలోనూ మార్పు తీసుకొస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా కన్హాలో ఏర్పాటు చేసిన కన్హా శాంతివనాన్ని ప్రారంభించారు. రామచంద్ర మిషన్ 75వ వసంతంలో అడుగుపెట్టిన రోజే ఈ కేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని కోవింద్ అన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రంగా పేరొందిన ఈ కేంద్రంలో లక్షల మంది అభ్యసిస్తున్నారని రాష్ట్రపతి తెలిపారు. రామచంద్ర మిషన్‌కు 150 దేశాల్లో కేంద్రాలు ఉండటం ఆనందంగా ఉందన్నారు. బుద్ధ, మహావీర్, నానక్, కబీర్, వివేకానంద వంటి ఆధ్యాత్మిక ప్రతినిధులు చూపిన బాటలో నేటి తరం నడవడం గొప్పవిషయమని పేర్కొన్నారు.
శాంతివనం ఎంతో పవిత్రమైన స్థలమని, ఇక్కడ నాటిన లక్షల మొక్కలు ఆహ్లాదం కలిగిస్తున్నాయని తెలిపారు. దైనందిన జీవితం నుంచి మార్పు కోరుకునే వారికి ఈ కేంద్రం ఉపశమనం ఇస్తుందన్నారు. పరమార్థం, పరోపకారం మనదేశ అంతర్గత వారధులని చెప్పారు.
ప్రపంచమంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం మన సంస్కృతి అని కోవింద్ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో దాదాజీ సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు.
- ఇవీ చూడండి: ఎప్పటిలాగే .. పాతపాటే .. మరోసారి మొండి చెయ్యే!