రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలను హేతుబద్ధీకరించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కరోనా విజృంభిస్తున్నందున ప్రతి పోలింగ్ కేంద్రంలో సాధ్యమైనంత తక్కువ మంది ఓటర్లు ఉండాలని భావిస్తోంది. గతంలో ఒక్కో కేంద్రం పరిధిలో పట్టణ ప్రాంతాల్లో 1,500 మంది.. గ్రామాల్లో 1,200 మంది ఓటర్లు ఉండాలని ఉత్తర్వులిచ్చింది. తాజా నిబంధనల మేరకు వెయ్యి మందికి ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తారని అధికారుల అంచనా. ఈమేరకు రాష్ట్రంలో బూత్‌ల సంఖ్య పెరుగుతుంది. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలోనూ జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేశారు.
ఒక కుటుంబంలో ఓటు హక్కు ఉన్న వారంతా ఒకే కేంద్రం పరిధిలోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని ఈసీ పేర్కొంది. సీఈసీ తాజా ఉత్తర్వుల మేరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ కోసం జిల్లా ఎన్నికల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ చెప్పారు. త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభమై.. జనవరి నాటికి ఓ కొలిక్కి వస్తుందని చెప్పారు. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబరులో ఉప ఎన్నిక జరగనుంది. అప్పటికి ఎన్నికల కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో 34,707 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
ఇదీ చదవండిః జమిలి ఎన్నిలకు సిద్ధం కావాలి... పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు