పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబవుతోంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండపై జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అందుకనుగుణంగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కోట ప్రాంగణంలో సఫాయూ కార్మికులు పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. వేడుకల సందర్భంగా పోలీసులు పరేడ్ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి ప్రాంగణానికి చేరుకున్న తర్వాత పోలీసులు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత సీఎం గౌరవ వందనం స్వీకరిస్తారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసులు పరేడ్ నిర్వహిస్తారు. పరేడ్ కోసం గోల్కొండ ప్రాంగణంలో రెండు రోజులుగా పోలీసులు రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు.
ఈ సారి కొత్తవాళ్లతో కవాతు నిర్వహిస్తున్నాం. 13లోగా పోలీసులు పూర్తి సన్నద్ధతతో ఉండేలా రిహార్సల్స్ నిర్వహిస్తున్నాం. పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షిస్తున్నాం. సీఎం కేసీఆర్.. జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం పరేడ్ ఉంటుంది.
-అభిలాష బిస్త్, అదనపు డీజీపీ
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గత రెండు రోజులుగా కవాతుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు.
-మురళీ కృష్ణ, కమాండెంట్
టీఎస్ఎస్పీ కమాండెంట్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. టీఎస్ఎస్పీ పోలీసులుగా ఇటీవల ఎంపికైన యువకులను పరేడ్ బృందానికి ఎంపిక చేశారు. పరేడ్ నిర్వహించే సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు, పోలీసులకు సూచిస్తున్నారు. కవాతు నిర్వహిస్తున్న సమయంలో చిన్న చిన్న పొరపాట్లను గుర్తిస్తున్న అధికారులు వాటిని వెంటనే సరిచేస్తున్నారు. పోలీసుల రిహార్సల్స్‌ను చూసేందుకు సందర్శకులు వస్తున్నారు. చరవాణిలో రిహార్సల్స్‌ను చిత్రీకరిస్తున్నారు.
ఇదీ చదవండి: ఓబీసీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం