రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో ఫార్మాసిటీ కోసం భూములు ఇవ్వబోమంటూ చేపట్డిన ధర్నాలో తాటిపర్తి, కుర్మిద్ద, నానక్ గూడ, మేడిపల్లి గ్రామాల రైతులు పాల్గొన్నారు. భూనిర్వాసితులకు తాము అండగా ఉంటామని, చట్టపరంగానే ముందుకెళ్తామని తెజస, భాజపా నేతలు భరోసా ఇచ్చారు. భూసేకరణ చట్టం - 2013 ప్రకారం పచ్చటి పంట భూములు బలవంతంగా లాక్కుంటే తాము ఉపేక్షించేది లేదని బాధిత రైతులు హెచ్చరించారు. ఇష్టపూర్వకంగా భూమి ఇస్తే ఎకరానికి రూ.16 లక్షలు లేదంటే నేరుగా బ్యాంకు ఖాతాలో రూ.7 లక్షలు జమ చేస్తామని ఆర్డీఓ ప్రకటించడంతో గందరగోళం, ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
ఒకదశలో ఆర్డీఓ, రైతుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. అంతలోనే ఉన్నట్టుండి రైతు మహిపాల్‌రెడ్డి తన శరీరంపై పెట్రోల్ పోసుకోవడం కలకలం సృష్టించింది. అప్రమత్తమైన సాటి రైతులు ఆయన నుంచి పెట్రోల్ బాటిల్ లాగేశారు. బందోబస్తులో ఉన్న పోలీసులు చూస్తూ ఉండిపోయారు... తప్ప ఏం చేయలేకపోయారు. అదే సమయంలో కాకతాళీయంగా వర్షం రావడం వల్ల ఆందోళనకారులు తలదాచుకోవడానికి చెల్లాచెదురయ్యారు. పరిస్థితి సద్దుమణిగింది.