ప్రభుత్వ అధికారులు తీసుకొస్తున్న కొత్త కొత్త ఆంక్షలతో తాము మానసిక ఒత్తిడికి గురవుతున్నామని పంచాయితీ రాజ్ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా తీసుకొచ్చిన జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వైఖరిని నిరసిస్తూ పలువురు పంచాయతీ కార్యదర్శులు హైదరాబాద్ లక్డికాపుల్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు.
గత కొన్నేళ్లుగా డీఎస్ఆర్ యాప్లో పని చేస్తున్నామని కొత్తగా ట్రాకింగ్ వ్యవస్థను తీసుకొచ్చి తమను మరింత వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఈ వ్యవస్థ ద్వారా మహిళా కార్యదర్శులు కుటుంబాన్ని వదిలి ఉదయాన్నే పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఈజీఎస్ను తొలగించి తమపై పని ఒత్తిడి తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా డీఎస్ఆర్ యాప్లో జీపీఎస్ ట్రాకింగ్ తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే తీవ్రమైన పని భారంతో పలువురు కార్యదర్శులు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారని తెలిపారు. గతంలో ఉన్న పాత పద్ధతిలోనే యాప్ను కొనసాగించాలని వారు కోరుతున్నారు.
పంచాయతీ కార్యదర్శుల విషయంలో తక్షణమే రెండు అంశాలు ప్రభుత్వం పరిశీలించాలి. పని ఒత్తిడితో మానసిక క్షోభకు గరవుతున్నాం. ఇప్పుడు కొత్తగా ట్రాకింగ్ యాప్ వచ్చేసరికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రావాల్సిన పరిస్థితి వస్తది. ప్రభుత్వానికి మా బాధలు విన్నవించుకుంటున్నాం. మాకున్న రెండే డిమాండ్లు ఈజీఎస్ తొలగిస్తే మాకు సగం టెన్షన్లు తగ్గుతాయి. డీఎస్ఆర్ యాప్లో ట్రాకింగ్ తీసేస్తే మా రిపోర్టులు మేం తప్పనిసరిగా ఇస్తాం. -పంచాయతీ కార్యదర్శి
ఇప్పటికే మేం డీఎస్ఆర్ యాప్లో పని చేస్తున్నాం. ప్రతి రోజు ఉదయాన్నే ఆరుగంటలకు వెళ్లాలంటే ఎలా వెళ్తాం. మాకు కుటుంబం, పిల్లలు ఉంటారు కదా. కొత్తగా యాప్లో ట్రాకింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఉదయాన్నే గ్రామ పంచాయతీలకు రావడం మహిళలకు ఎలా సాధ్యమవుతుంది. ఈజీఎస్ పనుల వల్ల మాపై పని ఒత్తిడి పెరుగుతోంది. మాకు ప్రభుత్వం ఏ పని అప్పగించినా విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. మా సమస్యలు పరిష్కరిస్తే మేము తప్పకుండా ప్రభుత్వానికి సహకరిస్తాం.- మహిళా పంచాయతీ కార్యదర్శి
ఇదీ చూడండి: 'పని చేస్తాం కానీ..అధిక పనిభారం వద్దు'