పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
శంకర్‌పల్లిలో...
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో 15 వార్డులకు గానూ ఒక వార్డు ఏకగ్రీవం కావడం వల్ల 14 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 28 పోలింగ్ కేంద్రాల్లో 150 మంది ఎన్నికల సిబ్బంది, 100 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు.
రాజేంద్రనగర్ నియోజక వర్గంలో
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పురపాలక ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. శంషాబాద్, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలతో పాటు బండ్లగూడజాగీర్ కార్పొరేషన్ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ పేర్కొన్నారు. మొత్తం 1,500 మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణ విధుల్లో పాల్గొంటారని ఆమె వివరించారు. 25న జరిగే ఎన్నికల లెక్కింపు కేంద్రాన్ని బండ్లగూడ జాగీర్‌లోని లార్డ్స్ కళాశాలలో ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు.
మేడ్చల్ జిల్లాలో
మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్,నాగారం, దమ్మాయిగూడ, గుండ్లపోచంపల్లి, తూముకుంట, కొంపల్లి, నిజాంపేట్ మున్సిపాలిటీల్లో పురపాలక ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు పంపవలసిన సామగ్రి, బ్యాలెట్ బాక్సులను సిబ్బందికి అందజేశారు.
ఇవీ చూడండి:రేపే పోలింగ్... పుర ఎన్నికలకు సర్వం సిద్ధం