రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు దారి తీసిన కారణాలపై అధికారులు వేరు వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె గదిని పరిశీలించిన పోలీసులు 98 వస్తువులు, పరికరాలు, సూక్ష్మ ఆధారాలను సేకరించారు. వారిద్దరి మధ్య వాగ్వాదం, పెట్రోల్ పోయడం, నిప్పంటించడం వంటి ఘటనలు కేవలం ఐదారు నిమిషాల్లోనే జరిగి ఉంటాయని భావిస్తున్నారు.
సంబంధిత కథనాలు: తహసీల్దార్ దారుణ హత్య... నాగోల్‌లో అంత్యక్రియలు
గడియారం ఎందుకు ఆగింది?
ఆధారాలు సేకరిస్తున్న సమయంలో గోడ గడియారంపై పోలీసుల కన్నుపడింది. 1.55 గంటలకు ఆగిపోయినట్లు గుర్తించారు. దీని ద్వారా ఘటన ఎప్పుడు జరిగిందనే విషయం నిర్ధరణ అయింది. ఘటనకు ముందు గడియారం పనిచేసిందని తెలుసుకున్న దర్యాప్తు బృందం... మంటల తీవ్రత వల్ల గడియారం ప్లాస్టిక్ కుంచించుకుపోయి 1.55 గంటలకు ఆగిపోయిందని గుర్తించారు. దీనితో ఘటన మధ్యాహ్నం 1.45 నుంచి 1.55 మధ్య జరిగి ఉంటుందని నిర్ధరించారు.
సంబంధిత కథనాలు: తహసీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి
ఆధారాల సేకరణ:
తహసీల్దార్‌పై నిందితుడు పెట్రోల్ పోసినపుడు కాలిపోయిన టవాల్ భాగాలతో సహా సేకరించిన ఆధారాలు ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు. ఘటనకు పాల్పడిన తర్వాత అక్కడి నుంచి బయటకు ఎలా వెళ్లాడన్న వివరాలు సేకరించారు. కాలిన గాయాలతో నిందితుడు సురేష్... రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు సేకరించారు.
సంబంధిత కథనాలు: లైవ్ వీడియో: తహసీల్దార్‌ను హత్య చేసి దర్జాగా వెళ్తున్న సురేష్
పథకం ప్రకారమే..
పథకం ప్రకారం సుమారు రెండు లీటర్ల పెట్రోల్‌తో ఉన్న క్యాన్‌ను సంచిలో పెట్టుకుని లోపలికి వచ్చి... విజయారెడ్డిని రెచ్చగొట్టేలా మాట్లాడి... ఆమె ఆవేశంతో ప్రతిస్పందించాకే సురేష్ సజీవ దహనం చేసి ఉంటాడని అంచనా వేశారు. కుర్చీలో కూర్చున్న విజయారెడ్డిపై పెట్రోల్ పోసి... ఆమె తేరుకునే లోపే లైటర్‌తో నిప్పంటించాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. మంటలతో ఆమె దగ్గరకు రాగానే సురేష్ మంటలు అంటుకున్నాయి. దీనితో ముందుగా తహసీల్దార్ గది నుంచి అతను బయటకు వచ్చాడు. అతడి వెనుక విజయారెడ్డి వచ్చారు. మంటలు ఆమె శరీరానికి పూర్తిగా వ్యాపించడంతో కుప్పకూలిపోయారు. అక్కడికక్కడే మృతి చెందారు.
సంబంధిత కథనాలు: తహసీల్దార్‌ని తగలబెట్టేశాడు... కారణం ఇదే..!