రంగారెడ్డి జిల్లాలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. హైదరాబాద్‌లో ప్రైమరీ కాంటాక్టు కారణంగా నమోదవుతున్న కేసుల వల్ల శివారు ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి విస్తృతమవుతోంది. కంటెయిన్‌మెంట్‌తో కట్టడి చేసేందుకు యత్నిస్తున్నా.. కొత్త ప్రాంతాల్లో కేసులు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వారం రోజుల కిందట వరకు జిల్లాలోని జీహెచ్‌ఎంసీ ప్రాంతంలోనే ఎక్కువగా కేసులు వెలుగు చూశాయి. ఇటీవల శివారు మున్సిపాలిటీలు, గ్రామాల్లోనూ కొత్త కేసులు వస్తున్నాయి.
- ప్రభుత్వ లెక్కల ప్రకారం శనివారం నాటికి జిల్లాలో 243 కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా నిత్యం 15-20మేర కేసులు వెలుగుచూస్తున్నాయి.
- శివారులో వస్తున్న కేసులు కొన్ని కుటుంబాలలోనే ఎక్కువగా ఉన్నాయి. పహాడీషరీఫ్‌లో జరిగిన ఒక వేడుక ద్వారా పహాడీషరీఫ్, మహేశ్వరం, హర్షగూడలో నాలుగు రోజుల వ్యవధిలోనే 37 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.
- రికవరీ శాతమూ ఎక్కువగా ఉండటం విశేషం. మొత్తం కేసుల్లో 111 మంది కోలుకోగా.. మిగతా వారు చికిత్స పొందుతున్నారు.
- జిల్లాలో 9 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరందరూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారేనని అధికారులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో కేసుల సంఖ్యలు ఇలా | ||
కేసులు | జీహెచ్‌ఎంసీ | జీహెచ్‌ఎంసీ మినహా ప్రాంతం |
మొత్తం | 135 | 108 |
యాక్టివ్ | 57 | 66 |
డిశ్చార్జి | 71 | 40 |
మృతులు | 7 | 2 |
ప్రైమరీ కాంటాక్టు కేసులే ఎక్కువ
జిల్లాలోని కేసుల్లో ఎక్కువగా ప్రైమరీ కాంటాక్టుకు సంబంధించినవే ఉంటున్నాయని కలెక్టర్ అమోయ్‌కుమార్ అన్నారు. కేసులు నమోదైన ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్ చేసి ఇంటింటి సర్వే చేయిస్తున్నామన్నారు.
ఇదీ చదవండిః కరోనా ఉన్నా.. లక్షణాలు లేకుంటే ఇంటికే!