ఎన్నికల వేళ ఓటర్ల పంట పండుతోంది. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లోని ఓ కుటుంబంలో ఆరుగురు ఓటర్లు ఉన్నారు. ఓ ప్రధాన పార్టీ తరఫున నాయకులు ఓటరు జాబితాతో సోమవారం ఆ ఇంటి ముందు వాలిపోయారు. ఆరు ఓట్లు తమ పార్టీ అభ్యర్థికే వేయాలని హామీ తీసుకుని ఒక్కొక్కరికి రూ. 5,000 చొప్పున రూ. 30,000 ఇచ్చి వెళ్లారు.
మరో రూ. 30 వేలిచ్చారు..
కాసేపటికి మరో ప్రధాన పార్టీ అభ్యర్థి వచ్చాడు. ఎవరు ఎన్ని పైసలు ఇచ్చినా సరే తీసుకుని.. తనకే ఓటు వేయాలని ప్రాధేయపడ్డారు. ప్రత్యర్థి పార్టీ రూ.5,000 ఇచ్చిందని తెలుసుకొని.. తానూ అంతే ఇస్తానని చెప్పి ఆరుగురు ఓటర్లకు రూ. 30,000 ఇచ్చారు.
మరొకరు ఓటుకు రూ. 3 వేలు..
తర్వాత మరో ప్రధాన పార్టీ అభ్యర్థి వచ్చి.. ఆ రెండు పార్టీల్లా ఎక్కువ ఇచ్చుకోలేనంటూ తలో రూ. 3,000 చొప్పున ఇచ్చి తనను గెలిపించాలని విన్నవించారు. ఇలా ఒకేరోజు ఆ కుటుంబానికి రూ. 78,000 వచ్చాయి. కేవలం ఈ ఒక్క కుటుంబమే కాదు.. హైదరాబాద్ శివారులో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.
ప్రతి చోట ఇదే తంతు...
ఓటుకు రూ.5 వేలు మొదలుకుని రూ.15 వేల వరకైనా ఇచ్చేందుకు అభ్యర్థులు వెనుకాడటం లేదంటే ప్రలోభాల పర్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదీ చూడండి : ఈ బెలూన్లను ఎట్టి పరిస్థితిలోనూ తాకొద్దు