Shoes to Avoid to Prevent Injury : చాలామందికి ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ చేసే అలవాటు ఉంటుంది. కొంతమంది కాసేపు రన్నింగ్ కూడా చేస్తుంటారు. ఇలా మార్నింగ్ వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము. అయితే.. రన్నింగ్ చేసేటప్పుడు సరైన షూలను ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మడమల దగ్గర ఎత్తుగా ఉండే షూలను వేసుకుని రన్నింగ్ చేయడం వల్ల గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తాజాగా ఓ పరిశోధనలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఎన్నో రోజుల నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవారికి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో పూర్తి అవగాహన ఉంటుంది. కానీ, కొత్తగా రన్నింగ్ మొదలు పెట్టేవారు ఇంట్లో ఉండే పాత షూలు, ఫ్యాషన్ కోసం కొన్నవి వేసుకుని మార్నింగ్ గ్రౌండ్లో పరుగెడుతుంటారు. అయితే.. రన్నింగ్ ప్రాక్టీస్ చేసే ముందు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. మరుసటి రోజు మోకాళ్లు, మడమలు, చీలమండ దగ్గర తీవ్రమైన నొప్పులు వస్తాయి. దీంతో రన్నింగ్ మధ్యలోనే ఆపేసే వారు ఎక్కువ మంది ఉంటారు. అయితే.. నార్మల్గా ఈ నొప్పులు రోజూ రన్నింగ్ చేయడం వల్ల కొన్ని రోజులకు తగ్గిపోతాయి!
రన్నింగ్ చేసేవారు మడమల దగ్గర ఎత్తుగా ఉండే షూలు వేసుకుని ప్రాక్టీస్ చేయడం వల్ల గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గుర్తించారు. ఇలాంటి షూలు వేసుకుని రన్నింగ్ చేసేటప్పుడు సరైన గ్రిప్ దొరకదని అంటున్నారు. అలాగే పాదాలకు అసౌకర్యం కలుగుతుందని వారు గుర్తించారు. ఈ పరిశోధనలో దాదాపు 700 మంది రన్నింగ్ చేసే వారిని పరిశీలించారు. ఇందులో వారు వేసుకుని షూ రకం, ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. అయితే, ఎత్తైన మడమలున్న షూలు వేసుకుని రన్నింగ్ చేసేవారు నొప్పులు, గాయాలతో ఎక్కువగా బాధపడ్డారని కనుగొన్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఎవరైనా సరే రన్నింగ్ చేయాలనుకున్నప్పుడు ధర కాస్త ఎక్కువైనా మంచి షూలు కొనాలి. షూలు ఎలా ఉండాలంటే.. వాటిని వేసుకోగానే పాదాలకు సౌకర్యంగా ఉండి గ్రౌండ్లో అయినా లేదా రోడ్డు పక్కన పరుగెత్తాలని అనిపించాలని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే.. రన్నింగ్ చేసేవారు ఎత్తైన మడమలున్న వాటిని కాకుండా.. ఫ్లాట్గా ఉండే షూలను ఎంపిక చేసుకోవాలని UF హెల్త్ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ సెంటర్ డైరెక్టర్ హీథర్ విన్సెంట్ సూచిస్తున్నారు. ఇవి వేసుకోవడం వల్ల పాదాలకు సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు. అలాగే సరైన గ్రిప్ లభించి గాయాలపాలయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రోజుకు 5 నిమిషాల పరుగుతో అన్ని ఆరోగ్య సమస్యలకు చెక్! - హాస్పిటల్ వైపు కూడా చూడరు!!
రోజూ ఇలాంటి ఆహారం తీసుకుంటే - చలికాలంలో సూపర్ హెల్దీగా ఉండొచ్చు!