రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో చేరేందుకు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు 75శాతం అవకాశం కల్పించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఇటీవల నియోజకవర్గ స్థాయిలో స్థానికులకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
నాలుగో తరగతి చదువుతున్న వారికి పరీక్ష నిర్వహించి ప్రవేశం కల్పిస్తున్నారని జీవన్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ బడుల పిల్లలు, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారని వివరించారు. పోటీ పరీక్షల్లో ప్రైవేటు విద్యార్థులకే మేలు జరుగుతోందని అభిప్రాయపడ్డారు. గురుకుల పాఠశాలల్లో చేరికకు స్థానిక రిజర్వేషన్లతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: KTR: పట్టణీకరణకు పెద్దపీట... మురుగునీటి శుద్ధిపై ప్రత్యేక శ్రద్ధ