పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఎన్ఎస్యూఐ షాద్నగర్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సేవలను ఆమె జెండా ఊపి ప్రారంభించారు.
కరోనాపై ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని సీతక్క ధ్వజమెత్తారు. వైరస్ బారినపడి సామాన్య ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చి, ఆక్సిజన్, ఔషధాల కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలకు కరోనా వస్తే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించారని, పేదోడికి మాత్రం ప్రభుత్వ దవాఖానాలే దిక్కయ్యాయని ఆక్షేపించారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న తెలంగాణలో పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుండాలి..
కరోనా బాధితులకు సేవలందించడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తమ శక్తిమేర కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. షాద్నగర్ పట్టణంలో కరోనా బాధితులకు, నిరాశ్రయులకు భోజనం, అంబులెన్స్ సేవలు అందించడానికి కృషి చేస్తున్న ఎన్ఎస్యూఐ జాతీయ కన్వీనర్ జె.ఆర్. దినేశ్ సాగర్ను సీతక్క అభినందించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ చేపట్టిన ఉచిత భోజన ఏర్పాట్లను పరిశీలించి.. స్వయంగా వంటలు చేశారు.