ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వస్తున్న నిధులన్నీ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కోరారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగులకు, రైతులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే నిధులు మంజూరు చేస్తామని ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్ గ్రామంలో అసైన్డ్ భూముల అభివృద్ధిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
గ్రామంలో 104 సర్వే నంబర్లో 90 ఎకరాల అసైన్డ్ భూమి ఉందని... ఆ భూమి అభివృద్ధి కోసం నిధులు కేటాయించడంతో 119 మంది రైతులు లబ్ధిపొందనున్నట్లు తెలిపారు. అసైన్డ్ భూముల అభివృద్ధి కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించడంతో ఎంతో మంది రైతులు లబ్ధి పొందుతారని ఎమ్మెల్యే అన్నారు. భూమిని చదును చేసుకొని వ్యవసాయం చేయడం ద్వారా రైతులు ఆర్థికంగా ఎదుగుతారని అభిప్రాయపడ్డారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ మహిపాల్, సర్పంచ్ హంసమ్మ, ఎంపీటీసీ, సర్పంచుల సంఘం అధ్యక్షులు రాంరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గ్రేటర్‌లో వెలువడిన తొలి ఫలితం... ఎంఐఎం బోణి