Mission Bhagiratha Leakage: మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ లీకేజీలు సరిచేస్తుండగా పైపులు పగిలి చుట్టుపక్కల పంట పొలాలు నీట మునిగిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లవాడ సమీపంలో చోటు చేసుకుంది. శ్రీశైలం వద్ద ప్రధాన పైపులైన్ మరమ్మతుల కారణంగా రెండు రోజులుగా చేవెళ్ల డివిజన్ వ్యాప్తంగా నీటి సరఫరా నిలిచిపోయింది. అక్కడక్కడా ఉన్న లీకేజీలను సరిచేయాలని అధికారులు నిర్ణయించారు.
అల్లవాడ శివారులో కంది- షాద్‌నగర్ రోడ్డు పక్కన కొన్ని రోజులుగా ప్రధాన పైపులైన్ లీకేజీ అవుతుండటంతో అక్కడ మరమ్మతులు చేపడుతున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా పైపులు పగిలిపోవడం వల్ల నీరు ఉవ్వెత్తున ఎగిసింది. పైపుల్లో నిల్వ ఉన్న నీరంతా వరదలా ప్రవహించింది. చుట్టు పక్కల ఉన్న పంట పొలాలు నీటమునిగాయి. సుమారు పదెకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. కుసుమ, బీట్రూట్, క్యారెట్ పంటలు పాడైనట్లు రైతులు వాపోయారు. నష్టపోయిన విషయమై ఏఈ ప్రపుల్‌ను రైతులు సంప్రదించారు. పంట నష్టం అంచనా వేసి పరిహారం అందేలా చూస్తామని చెప్పినట్లు రైతులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: